
'విద్యార్థులపై చర్యలను ఖండిస్తున్నాం'
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులపై కఠిన చర్యలను ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమెరికాకు వెళుతున్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని, కనీసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో ఎందుకు సంప్రదింపులు జరపడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. అమెరికాలో 22 మంది తెలుగు విద్యార్థులను హింసించి వెనక్కి పంపేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తమిళనాడులో తెలుగును రెండో అధికారభాషగా లేకుండా తొలగించే ప్రయత్నం జరుగుతున్నా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు పట్టించుకోక పోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగువారికి ఎక్కడ హాని జరిగినా స్పందిస్తామని గొప్పలు చెప్పుకున్న వారు ఇపుడు ఎందుకు మిన్నకుండి పోయారన్నారు. తక్షణం అమెరికాకు వెళ్లే విద్యార్థుల సమస్యలపైనా, తమిళనాడులో తెలుగు భాషను రెండో అధికారభాషగా రద్దు చేసే యత్నంపైనా స్పందించాలని గడికోట డిమాండ్ చేశారు.
చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నిర్వహించిన 6 భాగస్వామ్య శిఖరాగ్ర సదస్సు(పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్)లకు సంబంధించి శ్వేతపత్రం ప్రకటించాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన ఈ ఆరు సదస్సుల్లో ఎన్ని లక్షల కోట్లతో ఒప్పందాలపై (ఎంఓయూలపై) సంతకాలు జరిగాయి? వాటిలో ఎన్ని వాస్తవరూపం దాల్చాయి? ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? వంటి వివరాలను ధైర్యంగా ప్రభుత్వం వెల్లడిస్తుందా? అని ప్రశ్నించారు. విశాఖ భాగస్వామ్య సదస్సును ఆయన ప్రస్తావిస్తూ ఇలాంటివి చంద్రబాబు ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటారని వీటిపై ఆర్భాటం ఎక్కువ చేస్తారని అన్నారు. సదస్సులో ఒక్క రోజులోనే రూ.1.95 లక్షల కోట్ల మేరకు ఎంవోయూలు జరగ్గా అందులో రూ.1.15 లక్షల కోట్లు ఒక్క విద్యుత్ ఉత్పాదనారంగంలోనే అంటూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చిందని ఆయన తెలిపారు. 2015 సెప్టెంబర్ 23వ తేదీ కూడా ముఖ్యమంత్రి తన చైనా పర్యటనలో ఒక చైనా కంపెనీతో పది వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనా కేంద్రం నెలకొల్పడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, నాలుగు నెలలు గడిచినా అదేమైందో తెలియడం లేదని గడికోట అన్నారు. ఇలాంటి సదస్సుల్లో ఫోటోలు తీయించుకుని చేస్తున్నంత హడావుడి క్షేత్రస్థాయిలో ఆ తరువాత కనిపించదని చెప్పారు.
ఇలా సదస్సులు పెట్టి పారిశ్రామిక వేత్తలను బతిమాలి ఆహ్వానించే బదులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగరని గడికోట సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎక్కడెక్కడి పారిశ్రామివేత్తలు తలుపులు తోసుకుని ఆంధ్రప్రదేశ్‌లోకి మూకుమ్మడిగా వస్తారు కదా అని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలొస్తాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారని వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ చెబుతున్నా టీడీపీ వారు మాత్రం హేళనగా మాట్లాడారని ఆయన అన్నారు. చట్టబద్ధంగా మనకు దక్కాల్సిన ప్రత్యేక హోదా గురించి అసలు చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని భాగస్వామ్య సదస్సుల్లో హోదా గురించి గాని, ప్రత్యేక హోదా గురించి గాని ఎందుకు మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదని నిలదీశారు. సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని పక్కనే కూర్చో బెట్టుకున్నారు కానీ ఈ విషయమే ప్రస్తావనకు తీసుకు రాలేదన్నారు. గతంలో రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ కూడా ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదని చెప్పారు. జనవరి 3వ తేదీన రాష్ట్రానికి వచ్చిన నీతీ ఆయోగ్ అధ్యక్షుడు అరవింద్ ఫనాతో చంద్రబాబు సమావేశమైనపుడు ఆయనతో పొగిడించుకున్నారు కానీ ప్రత్యేక హోదా గురించి ఏమీ చెప్పలేదన్నారు.