
సిటీ హాట్ గురూ..
హైదరాబాద్: ఎండ ప్రచండమవుతోంది. తోటల నగరంగా పేరొందిన సిటీలో పచ్చదనం కరువవుతోంది. నగర విస్తీర్ణం మేరకు గ్రీన్‌బెల్ట్ 30 శాతం ఉండాల్సి ఉండగా.. కేవలం 8 శాతమే ఉంది. ఈ కారణంగానే వేసవి ఉష్ణోగ్రతలు ప్రజల్ని సొమ్మసిల్లేలా చేస్తున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిటీల్లో మనది రెండో స్థానంలో నిలిచింది. పాలకులు, ప్రజలు మేల్కొని పచ్చదనాన్ని పెంచకపోతే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదు!
శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు గ్రీనరీ తగ్గుతోంది. ఫలితంగా వేసవి తాపం పెరుగుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగవుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్న తరుణంలో వేసవి తాపం పెరిగి చిన్నారులు, వృద్ధులు, రోగులు విలవిల్లాడుతున్నారు.
హైదరాబాద్ నగర పాలక సంస్థ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ ఉందని జీహెచ్‌ఎంసీ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం విస్తీర్ణంలో సుమారు 8 శాతమే హరిత వాతావరణం ఉందన్నమాట. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ ్ట(హరితవాతావరణం) ఉండాల్సి ఉండాలి. ఇక మన పొరుగునే ఉన్న బెంగళూరు మహానగరంలో 13 శాతం (97 చదరపు కిలోమీటర్ల) మేర గ్రీన్‌బెల్ట్ ఉండడం విశేషం.
చేజేతులా...
వేసవిలో ఉదయం, సాయంత్రం పొడి వాతావరణం, మధ్యాహ్నం ఎండవేడిమి తీవ్రంగా బాధించినా..రాత్రి వేళ చల్లటి నిర్మలమైన వాతావరణం హైదరాబాద్ నగరానికున్న ప్రత్యేకత. ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న పేరుంది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళఅంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా..మొక్కల సంఖ్య అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్‌హౌజ్‌వాయువులైన కార్బన్‌డయాకై్సడ్, కార్బన్ మోనాకై్సడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం ఉక్కిరిబిక్కిరిచేస్తోంది.
మెట్రోనగరాల్లో వేసవి తాపం ఇలా..
మన దేశంలోని పలు మెట్రో నగరాల్లో మండుటెండలు కాసే మే నెలలో వేసవి తాపాన్ని పరిశీలిస్తే దేశరాజధాని ఢిల్లీ అగ్రభాగాన నిలిచింది. గత వందేళ్ల సగటును పరిశీలిస్తే ఇక్కడ గరిష్టంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. కొన్ని సార్లు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 48 డిగ్రీలు నమోదయిన సందర్భాలున్నాయి. ఇక హైదరాబాద్ 39.0 సగటు ఉష్ణోగ్రతలతో రెండోస్థానాన్ని ఆక్రమించింది. మూడో స్థానం మన పొరుగునే ఉన్న చైన్నైది. ఇక్కడ 37.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆతర్వాత 35.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో కోల్‌కత్తా నాలుగోస్థానంలో నిలిచింది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయి 33.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో ఐదవ స్థానంలో ఉంది. హరిత నగరంగా పేరొందిన బెంగళూరు 33.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలతో కూల్‌సిటీగా పేరుగాంచడం విశేషం.
పలు మెట్రోల్లో మే నెల ఇలా ఉంటుంది...
బెంగళూరు: ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 33 డిగ్రీల మేర ఉంటాయి. మధ్యాహ్నం ఎండవేడిమి మోస్తరుగా ఉన్నా..సాయంకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో సేదదీరేందుకు ఈ నగరం ఎంతో అనువైనది.
ముంబయి: మండువేసవిలో పగలు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొన్ని రోజులపాటు 40 డిగ్రీల మేర నమోదవుతాయి. ఎండవేడిమి తట్టుకోవడం కాస్త కష్టమే. ముంబాయి పర్యటన మే నెలలో వాయిదా వేసుకోవడమే మంచిది.
ఢిల్లీ: ఎండవేడిమిని తట్టుకోవడం కష్టమే. గరిష్టంగా కొన్నిసార్లు 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. టూరిస్టులు వేసవిలో రాజధానిని సందర్శిస్తే సొమ్మసిల్లాల్సి వస్తుందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు.
చెన్నై: ఆర్థశుష్క పొడి వాతావరణం ఉంటుంది. వాతావరణంలో రోజురోజుకూ శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి.భరించలేని ఉక్కపోతతో సతమతమవడం తథ్యం. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
పరిష్కారాలివే..
నగరంలోఉన్న చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్‌ఎంసీ అనుమతులు మంజూరు చేయాలి. నూతన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి.