(ముక్కెర చంద్రశేఖర్–కోరుట్ల) :వేసవిలో మండుటెండల నుంచి కార్మికులకు ఉపశమనం కలిగేలా గల్ఫ్ దేశాల్లో తీసుకొచ్చిన చట్టాలు పకడ్బం దీగా అమలు కావడం లేదు. గల్ఫ్ దేశాల్లో సాధారణంగా ఏడాది మొత్తం ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఈ దేశాల్లో ఎండాకాలం, శీతాకాలం మాత్రమే ఉంటాయి. వర్షాకాలం ఉండదు. నవంబర్ నుంచి మార్చి వరకు శీతాకాలం, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎండాకాలం ఉంటుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఎండలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. ఈ మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. సముద్ర తీరాలు, గ్యాస్ ఉత్పాదక కంపెనీలు ఉన్నచోట ఉష్ణోగ్రత దాదాపు 54 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. దీనికి తోడు ఉక్కపోత వాతావరణంతో కార్మికులు మరింత బలహీనంగా మారుతారు. ఈ పరిస్థితుల్లో ఆరుబయట పనిచేయడం కష్టతరం. వేసవిలో కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూన్, జులై, ఆగస్టు నెలల్లో పనివేళలు మారు స్తారు. ప్రతి రోజు 8 గంటల పనిచేయాల్సి ఉంటే.. తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనివేళలు మారుస్తారు. వేసవిలో మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆరుబయట కార్మికులతో పనిచేయించడం చట్ట విరుద్ధం. చట్టాలకు విరుద్ధంగా పనిచేయించే కంపెనీలకు భారీగా జరిమానా విధిస్తారు.
పట్టింపు అంతంతే..
జూన్, జులై, ఆగస్టు నెలల్లో మధ్యాహ్నం పనిచేయించరాదన్న నిబంధనపై పట్టింపు అంతంత మాత్రంగానే ఉంది. గల్ఫ్‌లోని చాలా కంపెనీలు ఈ నిబంధనలను పట్టించు కోకుండా ఆరుబయట భవన నిర్మాణ కార్మికులతో పనిచేయిస్తాయని మన కార్మికులు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులు ఆరుబయట పనిచేస్తున్నారా.. అన్న అంశంపై హెలికాపర్ల ద్వారా అక్కడి కార్మిక శాఖ నిఘా పెడుతున్నప్పటికీ పెద్దగా ఫలితం లేకుండాపోతోందని సమాచారం. ఒక్క ఒమన్ దేశంలోనే గత ఏడాది నిర్వహించిన తనిఖీల్లో సుమారు 771 కంపెనీలు వేసవి నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు కార్మిక శాఖ గుర్తించింది. దీంతో పాటు వేసవి వడగాలుల నుంచి కార్మికులు రక్షణ పొందేందుకు, ప్రాథమిక చికిత్సకు ఉపయోగపడే పరికరాలు, మందులు అందుబాటులో ఉంచకపోవడం శోచనీయం.
నిఘా పెంచాలి
గల్ఫ్ దేశాల్లో వేసవిలో మూడు నెలలు మ«ధ్యాహ్నం పనివేళలు బంద్ చేయడం సాధారణంగా జరుగుతుంది. కానీ, అన్ని కంపెనీలూ కచ్చితంగా ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈ విషయంలో నిఘా మరింత పెంచితే బాగుంటుంది. వేసవిలో ఉపశమనానికి కనీస వసతులు కల్పించని కంపెనీలు కూడా ఉన్నాయి. – గుగ్గిల్ల రవిగౌడ్,బీమారం, మేడిపల్లి, జగిత్యాల జిల్లా
వేడిని తట్టుకోలేం..
వేసవిలో మూడు నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి 48– 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడి ఉంటుంది. ఈ వేడికి.. ఉక్కపోతకు శరీరంలోని నీరంతా బయటకు పోయి నీరసం వస్తుంది. కంపెనీల్లో పనిచేసే వారికి కష్టాలు తప్పవు. భవన నిర్మాణంలో పనిచేసే కార్మికులు చాలా మంది వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. –దావేరి శ్రీనివాస్, సంగెం,కోరుట్ల మండలం, జగిత్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment