
నేటి సాయంత్రం నుంచి పలు దేవాలయాలు మూసివేత
హైదరాబాద్ : సూర్యగ్రహణం బుధవారం ఉదయం సంభవించనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలను మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు ఆయా దేవాలయాలకు చెందిన ఉన్నతాధికారులు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నేటి రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 10.00 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని రాత్రి 7.00 గంటల నుంచి రేపు ఉదయం 12.00 గంటలకు మూసివేస్తారు.
అలాగే తెలంగాణలోని వేములవాడ రాజన్న దేవాలయాన్ని కూడా ఈ రోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రేపు ఉదయం 6.00 గంటల వరకు మూసివేస్తారు. యాదగిరిగుట్టలోని యాదాద్రి దేవాలయాన్ని రాత్రి 8.30 గంటల నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు ఆలయం మూసివేస్తారు. ఆదిలాబాద్ జిల్లా బాసర దేవాలయం కూడా నేటి రాత్రి 7.00 గంటల నుంచి రేపు ఉదయం 7.30 గంటల వరకు మూసివేస్తారు.