
ఆలయాల మూసివేత
సూర్యగ్రహణం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో మంగళవారం రాత్రి నుంచి మూత
సాక్షి నెట్‌వర్క్: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మంగళవారం రాత్రి నుంచి మూసివేశారు. బుధవారం ఉదయం 5.47 నుంచి 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనున్న నేపథ్యంలో అటు తిరుమల శ్రీవారి ఆలయం, బెజవాడ కనకదుర్గ, అన్నవరం సత్యదేవుని ఆలయాలతోపాటు ఇటు తెలంగాణలోని భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ సహా పలు ప్రముఖ ఆలయాల తలుపులను మంగళవారం రాత్రి మూసివేశారు. శుద్ధి, సంప్రోక్షణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బుధవారం మధ్యాహ్నం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
ఇలాఉండగా.. నిత్యం గంట విరామం కూడా లేని తిరుమలేశునికి సూర్యగ్రహణం వల్ల సుమారు 13 గంటల పాటు విరామం లభించింది. ఆలయ నిబంధనల ప్రకారం గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయాన్ని, నిత్యాన్నప్రసాద కేంద్రాన్ని మూసివేస్తారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 8.30కు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆధ్వర్యంలో ఆలయ మహద్వారం మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించి 11 గంటల నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఈవో, జేఈవో వెల్లడించారు.