‘పది’ మూల్యాంకనంలో లోపాలు!
- 2 నుంచి 20 మార్కుల వరకు తేడాలు
- రీ వెరిఫికేషన్‌తో బయటపడుతున్న వైనం
- దరఖాస్తు చేసుకున్న8,352 మంది విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో లోపాలతో విద్యార్థులు నష్టపోతున్నారు. రీ వెరిఫికేషన్ ద్వారా చాలా మంది విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో మార్కుల్లో తేడాలు బయటపడుతున్నాయి. ఉపాధ్యాయులు సరిగ్గా మూల్యాంకనం చేయకపోవడం, మార్కులను సరిగ్గా లెక్కించి వేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. గత మార్చిలో జరిగిన పరీక్షల్లో బాగానే రాసినా తక్కువ మార్కులు వచ్చాయని గుర్తించిన దాదాపు 8,352 మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్థుల రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది.
మిగిలిన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రతి జిల్లాలో ఆరు చొప్పున విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక నిపుణుల కమిటీల నేతృత్వంలో కొనసాగుతోంది. అయితే రీ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థుల్లో చాలా మంది మార్కులు మారినట్లు సమాచారం. మొదట్లో ఇచ్చిన మార్కులకు రీ వెరిఫికేషన్ ద్వారా వచ్చిన వాటికి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు తేలింది. కమిటీలు పరిశీలించిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీలు, తేడా వచ్చిన మార్కుల వివరాలతో కూడిన నివేదికలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించాయి. వాటిని పరీక్షల విభాగం కూడా మరోసారి పరిశీలన జరుపుతోంది.
పూర్తయ్యింది 50 శాతమే..
జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు తేల్చిన నివేదికల ప్రకారం తొలుత ఇచ్చిన మార్కులకు, రీ వెరిఫికేషన్ అనంతరం వచ్చిన మార్కులకు మధ్య 15 నుంచి 20 మార్కుల వరకు తేడాలు కొంత మంది విద్యార్థుల విషయంలో చోటుచేసుకున్నట్లు తెలిసింది. 2 నుంచి 15 వరకు మార్కుల్లో తేడా చాలా మంది విద్యార్థుల విషయంలో జరిగినట్లు సమాచారం. 50 శాతం దరఖాస్తుల విషయంలోనే ఈ తేడాలు రాగా, మిగిలిన వాటి విషయంలోనూ ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే టీచర్లు ఎలా చేసినా.. అది విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేయడంతోపాటు రీ వెరిఫికేషన్ దరఖాస్తుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి తెస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
చర్యలు చేపడుతున్నా..
మూల్యాంకనంలో తప్పులు చేసే టీచర్లపై చర్యలు చేపడుతున్నా పొరపాట్లు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో దాదాపు 250 మందికి పైగా టీచర్ల ఇంక్రిమెంట్లలో కోత పడగా, వారు మళ్లీ స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొనే అర్హతను కోల్పోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.