సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్: హెచ్ సీయూలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్కు న్యాయం జరగాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటి వ్యక్తులను యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు మాజీ మంత్రులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ నుండి పలువురు విద్యార్థులు హెచ్సీయూకు చేరుకున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కాగా ఐడీ కార్డు లేనివారిని పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది విద్యార్థులు హెచ్సీయూకు రానున్నట్లు విద్యార్థి జేఏసీ నేతలు వెల్లడించారు. హెచ్సీయూలో ఇవాళ నిర్వహించే సభలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బాలచంద్ర ముంగేకర్, జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీనా కందస్వామి, హరగోపాల్, కాకి మాధవరావు సహా పలువురు పాల్గొననున్నారు.