పదోతరగతి వార్షిక పరీక్షలకు నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సిందిగా పరీక్షల సంచాలకులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: 2017 మార్చిలో జరిగే పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి నవంబర్ 15లోగా ఫీజు చెల్లించాల్సిందిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి రెగ్యులర్‌తో పాటు ప్రైవేటు, ఓపెన్, ఒకేషనల్ కేటగిరీ విద్యార్థులు కూడా ఆలోపు ఫీజు చెల్లించాలన్నారు. గడువు దాటితే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 23, రూ.200ల అపరాధ రుసుముతో డిసెంబర్ ఒకటోతేదీ, రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ తోమ్మిదో తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చొప్పున, గతంలో ఫైయిలై మూడు సబ్జెక్టులలోపు పరీక్షలు రాసే విద్యార్థులు రూ.110, మూడు సబ్జెక్టులు మించితే రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.24వేల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20వేలు, ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్న పిల్లలు ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు. ఇందుకు తగిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని, ప్రధానోపాధ్యాయుడు సంతృప్తి చెందితేనే ఫీజు మాఫీ చేయనున్నట్లు చె ప్పారు.
పిల్లలు చెల్లించిన ఫీజుమొత్తాన్ని నిర్దేశిత గడువులోగా సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో లేదా స్టేట్‌బ్యాంకులో జమచేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థుల నామినల్‌రోల్స్‌ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.