‘ప్రైవేటు’లో బోధనకూ టెట్ తప్పనిసరి!
‘ప్రైవేటు’లో బోధనకూ టెట్ తప్పనిసరి!
Published Thu, Jun 15 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
- టెట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసిన విద్యా శాఖ
- నిబంధన తప్పనిసరి చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో బోధించే టీచర్లు.. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్) అర్హత సాధించి ఉండాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఇటీవల జారీ చేసిన టెట్ నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. టెట్‌లో అర్హత సాధించిన వారే ఏ పాఠశాలల్లో అయినా బోధన చేయడానికి అర్హులని పేర్కొంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు టెట్ పేపరు–1లో, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే వారు టెట్ పేప రు–2లో అర్హత సాధించి ఉండాలని పేర్కొం ది. విద్యాశాఖ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు స్కూళ్ల లో టెట్‌లో అర్హత సాధించిన వారితోనే బోధన చేపట్టేలా నిబంధనలను తప్ప నిసరి చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 25 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో టెట్‌లో అర్హత సాధించిన వారినే టీచర్లుగా నియమిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కార్యాచరణను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
టెట్‌లో అర్హత లేని వారే అనేక మంది..
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఎలాంటి శిక్షణ పొందని వారు అనేక మంది పని చేస్తున్నారు. టెట్‌లో అర్హత సాధించని వారే ప్రాథమిక పాఠశాలల్లో 64 శాతం మంది టీచర్లుగా పని చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై పట్టు ఉండదు. పాఠ్య పుస్తకాల నేపథ్యం, తాత్వికత, అభ్యాసాలు, విద్యా ప్రమాణాల గురించి అవగాహన ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, వారాంతంలో పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో కేవలం 48 శాతమే టెట్‌లో అర్హత పొందిన వారున్నారని ఇటీవల విద్యాశాఖ క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీల్లో వెల్లడైంది.
మొరాయించిన సర్వర్..
టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 13న ప్రారంభమైంది. బుధవారం ఆన్‌లైన్ దరఖాస్తుల సర్వర్ మొరాయించడంతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఎక్కువ మంది ఒకేసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయిందని, అందుకే పని చేయలేదని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement