దళిత బాంధవుడికి పుష్పాంజలి
కవాడిగూడ,న్యూస్‌లైన్: భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 57వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోలాహలం నెలకొంది. పలువురు రాజకీయ,ఉద్యోగ,దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిలంచారు. నాయకులు,అభిమానులు ఎంతో అభిమానంతో వేసిన దండలతో విగ్రహం నిండిపోయింది. ఈసందర్భంగా పలువురు దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణ్‌కుమార్, ప్రజాగాయకుడు గద్దర్, అరుణోదయ విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, ఉపాధ్యక్షుడు వేదకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, నగర అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ఆంధ్రామేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైసయ్య, ప్రధానకార్యదర్శి బి.రాజారాం, మాలమహానాడు అధ్యక్షులు జి.చెన్నయ్య, కారెం శివాజీ, ఆలిండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు మహేశ్వర్‌రాజ్, కేవీపీఎస్ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, శంకర్‌నాయక్ తదితరులు మహానుభావుడి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
రెండు ప్రాంతాల నినాదాలు: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, చలసాని శ్రీనివాసరావు, కారెం శివాజీలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న సమయంలో..ఒక తెలంగాణవాది జెతైలంగాణ అని నినాదాలు చేయడంతో.. కారెం శివాజీ జై సమైక్యాంధ్ర నినాదాన్ని అందుకున్నారు.
బాబాసాహెబ్‌కు జగన్ నివాళి
సాక్షి,హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లోటస్‌పాండ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి, పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, బీసీ విభాగం కన్వీనర్ గట్టు రామచంద్రరావు, హైదరాబాద్ జిల్లా ఎస్సీ కన్వీనర్ రవికుమార్, నేతలు డా.ప్రఫుల్లారెడ్డి, నీలంరాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, తమ్మినేని సీతారాం, చల్లా మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.