నైతిక విలువలతో శిక్షణ వల్లే అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: మానవ వనరులకు నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వడం వల్లే దేశం అభివృద్ధివైపు పురోగమిస్తోందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) నలభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నిర్వహించిన వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలని, వాటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి దిశగా నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్నారు.
దేశంలో తెలివిగల వ్యక్తులు, డిగ్రీలు కలిగినవారు ఉన్నప్పటికీ అంతిమ ఫలితంలో ఎక్కడో లోపం వెంటాడుతోంద ని, అభివృద్ధి, శాస్త్రవేత్తలు పెరిగినా మానవ సంబంధాలు అనుకున్నంత స్థాయిలో బలోపేతం కావడం లేదన్నారు. అందుకే హెచ్‌ఆర్డీలో శిక్షణ తరగతులను విస్తృత పరచాలని సూచించారు. శిక్షణ పద్ధతుల్లో మూస ధోరణికి స్వస్తి పలికి.. నూతన పంథా అవలంబించాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో దేశం మొత్తంలో రాష్ట్రం వెనకబడి ఉందని, ముందంజ వేయాలంటే హెచ్‌ఆర్డీ వంటి సంస్థలు మార్గనిర్దేశం చేయాలన్నారు.
బయటివారికి శిక్షణ తరగతులు: కడియం
మానవ వనరులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఎంసీఆర్‌ెహఆర్డీలో ప్రభుత్వ రంగ సంస్థ లు, అధికారులకే కాక ఇతర రంగాలకు చెందిన వారికీ శిక్షణ ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. అవసరమైతే సిబ్బందిని పెంచుకుని సంస్థగా ఎది గి, సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. రాష్ట్రంలో పుష్కలమైన వనరులు, నిధులు ఉన్నందున ఆ దిశగా కృషి చేయాలన్నారు. ప్రజలను సంఘటిత శక్తిగా మార్చడానికి శిక్షణ నైపుణ్యాలే సరైన మార్గమని పేర్కొన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు బడ్జెట్‌రూపకల్పన, ప్రణాళిక, ఖర్చు, పద్దులు తదితర అంశాలు తెలియవని, తాను కూడా ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలోనే తర్ఫీదు పొందానని గుర్తు చేసుకున్నారు.
ఫలాలు అందరికీ అందితేనే సార్థకత..
మానవ వనరులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే క్రమంలో విజయం సాధిస్తే ఏ దేశమైనా పురోగతి సాధిస్తుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ 40 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని, ఇక్కడ శిక్షణ పొందిన వారు అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సమాజాన్ని మార్చగలిగేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులేనని దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విషయం అందరి గుండెల్లో దాగుందన్నారు. సమాజంలో మానవ విలువలు తరిగిపోతున్న తరుణంలో వాటిని పాదుకొల్పేలా మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కె.అగర్వాల్‌తో పాటు సంస్థ సిబ్బంది, శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.