'మేమిద్దరం మరోసారి కూర్చుంటాం'
హైదరాబాద్ : విద్యార్థుల భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా... సమస్యలు పరిష్కరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంసెట్ కౌన్సలింగ్‌కు సంబంధించిన ప్రాథమిక రికార్డ్స్ విషయమై.. ఇరు రాష్ట్ర విద్యాశాఖా మంత్రులు కడియం శ్రీహరి, గంటా శ్రీనివాసరావు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పదో షెడ్యూల్‌లోని విద్యాసంస్థల పరిస్థితులపై.... ఆరా తీయాలని నరసింహన్‌ను కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మాట్లాడిన గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కీలక సమస్యలపై మరోసారి ఇద్దరు మంత్రులం భేటీ అయి పరిష్కరించుకుంటామన్నారు.
ఉన్నత విద్యామండలి వ్యవహారంపై కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారని గంటా తెలిపారు. పదో షెడ్యూల్లని అన్ని సంస్థలపై తమ పరిధిలో ఉన్న మేరకు చర్చిద్దామన్నారని, తమస్థాయిలో పరిష్కారం దొరకకుంటే అప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ల వద్దకు వెళ్తారని గంటా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్చించడానికి ఏపీ అధికారులు కొంత సమయం అడిగారని, ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఇరు రాష్ట్రాల విద్యాశాఖమంత్రులు కూర్చొని సమస్య పరిష్కరిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యామండలి రికార్డులు ఇచ్చేందుకు తెలంగాణ అధికారులు అంగీకరించారని ఆయన తెలిపారు. అయితే ఎంసెట్ కౌన్సెలింగ్ సెంటర్లపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.