కూతురు చదువు విషయంలో ఓ తండ్రి కాఠిన్యం ప్రదర్శిస్తే... ఆ చిన్నారి మాత్రం తండ్రి పట్ల నిండు ప్రేమను ప్రదర్శించింది. చూసేవారిని కదిలించే ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి సీఐ రమేష్ తెలిపిన వివరాల మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన వి.మధుకర్(29) మసీద్‌బండలో నివాసముంటూ సెంట్రింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె స్పందన (8) స్థానిక మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది.
సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత సరిగా చదవడం లేదని తండ్రి మధుకర్ కుమార్తెను మందలించాడు. అంతటితో ఆగకుండా చాకు కాల్చి కుడి చేయి, ఎడమ పాదంపై వాతలు పెట్టాడు. దీంతో బొబ్బలు వచ్చాయి. మంగళవారం పాఠశాలకు వచ్చిన స్పందన వంటిపై గాయాలను చూసిన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి ప్రధానోపాధ్యాయులు అనంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన గచ్చిబౌలి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తండ్రి మధుకర్‌ను అరెస్టు చేశారు.
ఐసీడీఎస్ శేరిలింగంపల్లి సీడీపీఓ లక్ష్మీబాయి పరిస్థితిని సమిక్షించి బాలికను హైదర్షాకోట్‌లోని సదర్‌హోంకు తరలించారు. కాగా, ఐసీడీఎస్ అధికారుల వెంట వెళ్లేందుకు స్పందన నిరాకరించింది. తనకు నాన్నే కావాలని, ఇంటికి వెళ్తానని మారాం చేసింది. తన తండ్రిని ఏమి అనవద్దని పోలీసులను, అధికారులను వేడుకుంది. అయితే, అధికారులు పాపకు నచ్చచెప్పి సదర్‌హోంకు తరలించారు.