మహిళలకు ప్రత్యేకం 181
ఈ హెల్ప్‌లైన్ మహిళలకు ప్రత్యేకం 181
⇒ ఫిర్యాదులు, సలహాల స్వీకరణకు ప్రత్యేక నంబర్
⇒ వారం రోజుల్లో అందుబాటులోకి..
⇒ ఏర్పాట్లు పూర్తి చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ
⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం త్వరలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదులను స్వీకరించేందుకు ‘181’అనే నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉమెన్ హెల్ప్‌లైన్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రస్తుతం అత్యవసర సేవల (డయల్ 100) కింద సేవలందిస్తున్న సంస్థతో ఒప్పందం చేసుకుంది. వచ్చే వారంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ హెల్ప్‌లైన్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనుంది. ఫిర్యాదులపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపి తక్షణ చర్యలు తీసుకోనుంది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచనుంది.ఫిర్యాదుల స్వీకరణ..
పథకాల విశదీకరణ..
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తీసుకొస్తున్న ఉమెన్ హెల్ప్‌లైన్ కేవలం మహిళా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాదు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైనా అవగాహన కల్పిస్తుంది. ఆ పథకానికి సంబంధించి లబ్ధి జరిగే తీరును విశదీకరిస్తుంది.
హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫిర్యాదులన్నీ రికార్డ్ చేయడంతోపాటు వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించే వరకు నిరంతరంగా పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. హెల్ప్‌లైన్ నిరంతరం (24/7) పనిచేస్తుంది. సమస్య లు, సలహాలతోపాటు మహిళల రక్షణకు హెల్ప్‌లైన్ ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. అనుకోని సంఘటనలు జరి గితే మహిళలకు అత్యవసర విడిది ఏర్పాటు చేస్తుంది. మహిళల అక్రమ రవాణా తదితర సమాచారాన్ని సేకరించి రక్షణ చర్యల్లో కీలక భూమిక పోషిస్తుంది.