
ఈసీఐఎల్ చరిత్రలో గొప్ప విజయం: వ్యాస్
ఈసీఐఎల్ రూపకల్పన చేసిన ఆల్ట్రా స్టేబుల్ పవర్ కన్వర్టర్లు సంస్థ చరిత్రలోనే మరో గొప్ప విజయమని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ కె.ఎన్.వ్యాస్ అభిప్రాయపడ్డారు.
ఈసీఐఎల్ రూపొందించిన పవర్ కన్వర్టర్లు జర్మనీకి తరలింపు
హైదరాబాద్ : ఈసీఐఎల్ రూపకల్పన చేసిన ఆల్ట్రా స్టేబుల్ పవర్ కన్వర్టర్లు సంస్థ చరిత్రలోనే మరో గొప్ప విజయమని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ కె.ఎన్.వ్యాస్ అభిప్రాయపడ్డారు. జర్మనీలో నిర్మిస్తున్న ఫెసిలిటీ ఫర్ యాంటీప్రోటాన్ అండ్ అయాన్ రీసెర్చ్ (ఫెయిర్) అంతర్జాతీయ ప్రయోగశాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే అవకాశం ఈసీఐఎల్‌కు దక్కింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పవర్ కన్వర్టర్లలను శనివారం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నుంచి జర్మనీకి రవాణా చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యాస్, ఈసీఐఎల్ చైర్మన్ అండ్ ఎండీ పి.సుధాకర్‌తో కలసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కీలక పరికరాల్ని తయారు చేసే అవకాశం సంస్థకు దక్కడం అభినందనీయమన్నారు. పి.సుధాకర్ మాట్లాడుతూ జర్మనీలోని ఫెయిర్ పరిశోధన కేంద్రానికి భారత ప్రభుత్వం రూ.270 కోట్ల సాయం ఇవ్వనుందన్నారు. దీనిలో భాగంగా రూ. 67 కోట్ల విలువైన సాంకేతిక పరికరాల్ని తయారు చేసే బాధ్యతను ఈసీఐఎల్‌కు అప్పగించిందన్నారు.