పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ఉస్మానియా ఆస్పత్రికి చేరుకొని సకాలంలో వైద్యం అందక ...
► మహిళకు శాపం
► పురిటి నొప్పులతో ఉస్మానియాకు వచ్చిన గర్భిణి
► క్యాజువాలిటీలోనే కవల పిల్లలను ప్రసవించి మృతి చెందిన వుహిళ
► వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త ఆరోపణ
► తమ వద్దకు రాలేదంటూ ఆస్పత్రి వైద్యుల బుకాయింపు
గన్‌ఫౌండ్రీ: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణి ఉస్మానియా ఆస్పత్రికి చేరుకొని సకాలంలో వైద్యం అందక క్యాజువాలిటీలో కవలలకు జన్మనిచ్చి మృత్యుఒడికి చేరింది. దీంతో వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో ఆమెను నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకోవడమేగాక, ఆస్పత్రికి ఎవరూ ఆస్పత్రికి రాలేదని గోప్యంగా ఉంచేందుకు యత్నించిన సంఘటన గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లాకు చెందిన కమార్ భార్య అపర్ణ(25) గర్భవతి. వైద్యం కోసం దంపతులు గురువారం నగరానికి వచ్చారు. ఎంజీబీఎస్ సమీపంలోకి రాగానే అపర్ణకు పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త ఆటోలో ఎక్కి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు. దీంతో ఆటోవాలా సమీపంలోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.
క్యాజువాలిటీలోకి వెళ్లగానే అపర్ణ పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అప్పటికే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి వెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో ఆమె ఆస్పత్రి క్యాజువాలిటీ ఆవరణలోనే కవలలకు జన్మనిచ్చి తాను కన్నుమూసింది. దీంతో ఆస్పత్రి వైద్యులు అపర్ణతో పాటు కవల పిల్లలను అంబులెన్స్‌లో నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి పంపగా, అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య మృతిచెందిందని ఆమె భర్త కుమార్ ఆరోపించారు. ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా నయాపూల్ ప్రసూతి ఆస్పత్రికి తరలించారని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఉస్మానియాలో ప్రసవం జరగలేదు: సీఎంవో డాక్టర్ శంకర్
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణి మరణించిందన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఉస్మానియా ఆస్పత్రి సీఎంవో డాక్టర్ శంకర్ అన్నారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగి పేరును రిజిస్ట్రార్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. అపర్ణ అనే గర్భిణి కవలలకు జన్మనిచ్చి మరణించిందన్న వార్తలో నిజం లేదని, ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారన్నారు.