ప్రముఖుల ఇంట విషాదాలు!
►కుమారుల్ని కోల్పోయిన వారే ఎక్కువ
►మితిమీరిన వేగమే ప్రధాన కారణం
►చాలా ప్రమాదాలు ఓఆర్‌ఆర్ పైనే..
సిటీబ్యూరో: సిటీ కేంద్రంగా తరచుగా ప్రముఖుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేక మంది వీఐపీల వారసుల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధికం మితిమీరిన వేగం వల్ల జరిగినవే. ఈ దుర్ఘటనల్లో కుమారుల్ని కోల్పోయిన ప్రముఖులే ఎక్కువగా ఉంటున్నారు. వీటిలో ఎక్కువగా ఓఆర్‌ఆర్‌పై జరిగినవే ఉన్నాయి. ప్రమాదానికి కారణమైన వాహనాలు సైతం హైస్పీడ్, ఇంపోర్టెడ్‌వి కావడం గమనార్హం.
►2003 అక్టోబర్ 12న అప్పటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాబూమోహన్ పెద్ద కుమారుడు పి.పవన్‌కుమార్ రసూల్‌పుర నుంచి జూబ్లీహిల్స్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా... జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద రోడ్ డివైడర్‌ను ఢీకొనడంతో చనిపోయారు.
►2010 జూన్ 20న ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత కోట శ్రీనివాసరావు కుమారుడు ప్రసాద్ హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో జరిగిన ప్రమాదంలో కన్నుమూశారు. ఈయన ప్రయాణిస్తున్న హైస్పీడ్ ద్విచక్ర వాహనం మరో వాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
►2011 సెప్టెంబర్ 11న హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్‌రోడ్‌పైన పుప్పాలగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ కన్నుమూశాడు. ఆ సమయంలో ఈయన ప్రయాణిస్తున్న హైఎండ్ బైక్ ప్రమాదానికి గురైంది.
►2011 డిసెంబర్ 20న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. దీంతో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు.
►2012 ఆగస్టు 21న మాజీ మంత్రి పులి వీరన్న కుమారుడు ప్రవీణ్ తేజ ఓఆర్‌ఆర్‌పై దుర్మరణం చెందారు. ఈయన ప్రయాణిస్తున్న కారు టర్నింగ్ తీసుకుంటూ అదుపుతప్పి బోల్తా పడింది.
►2015 నవంబర్ 25న మాజీ డీజీపీ, ప్రభుత్వ సలహాదారు పేర్వారం రాములు మనుమడు వరుణ్ పవార్, బంధువు రాహుల్ పవార్ సహా ముగ్గురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌పై ముందు వెళ్తున్న పాల వ్యాన్‌ను బలంగా ఢీ కొంది.
►2016 మే 17న మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్ రెయిలింగ్‌ను (క్రాష్ బ్యారియర్) బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి (52), డ్రైవర్ స్వామిదాసు (52) అక్కడిక్కడే కన్నుమూశారు.