తరలింపు ఆగస్టుకు పూర్తి
జూన్, ఆగస్టు నెలాఖరుల్లో వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగుల అంగీకారం
♦ తొలుత శాఖాధిపతుల కార్యాలయ సిబ్బంది 1,400 మంది తరలింపు
♦ సచివాలయానికి అన్ని సౌకర్యాలతో 3.5 లక్షల చ. అడుగుల వసతి
♦ ముఖ్యమంత్రి కార్యాలయానికి 50 వేల చదరపు అడుగులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆగస్టు నెలాఖరుకు వెలగపూడికి తరలిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ నెలాఖరు, ఆగస్టు నెలాఖరుకు రెండు విడతలుగా వెలగపూడికి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అంగీకరించిందని పేర్కొంది. తొలి దశలో శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచే సే ఉద్యోగుల్లో 1,400 మందిని మాత్రమే రాజధానికి తరలించాలని నిర్ణయించారు. ప్రస్తుతం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులోనే సచివాలయంతో పాటు అసెంబ్లీ, శాసనమండలి, శాఖాధిపతుల కార్యాలయాలకు వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయానికి అన్ని సౌకర్యాలతో కలిపి 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం అవుతుందని అంచనాకు వచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి 50 వేల చదరపు అడుగుల వసతి కావాలని తేల్చారు. వెలగపూడిలో ప్రస్తుతం ఆరు భవనాల కాంప్లెక్స్‌ల నిర్మాణం కొనసాగుతోంది. వీటిలో రెండేసి అంతస్తుల చొప్పున ఒక్కో అంతస్తుకు 50 వేల చదరపు అడుగులతో అన్ని సదుపాయాలతో ఆరు లక్షల చదరపు అడుగులు జూన్ నెలాఖరుకు పూర్తవుతాయని సీఎస్ సమీక్షలో నిర్ధారణకు వచ్చారు.
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు వేర్వేరుగా...
శాఖాధిపతుల కార్యాలయాలను, సచివాలయ కార్యాలయాలను ఒకే బ్లాకులో ఉంచవద్దని, సెక్యూరిటీ పరంగా సమస్యలు వస్తాయని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు తొలుత నిర్మాణంలో ఉన్న 1 నుంచి 3 భవనాల్లోని రెండేసి అంతస్తుల్లో సచివాలయ కార్యాలయాలకు కేటాయిస్తారు. అనంతరం ఈ బ్లాకుల్లోనే మరో రెండు, మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టిన తరువాత సచివాలయ కార్యాలయాలను 1, 2 బ్లాకుల్లోని మొత్తం అంతస్తుల్లోనే ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
మూడో బ్లాకును పూర్తిగా శాఖాధిపతుల కార్యాలయాలకు కేటాయిస్తారు. ఆరో బ్లాకులో కింద రెండు అంతస్తులను అసెంబ్లీ, మండలికి కేటాయించినప్పటికీ పైన నిర్మించే మూడు నుంచి ఐదో అంతస్తు వరకు శాఖాధిపతులకు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తం శాఖాధిపతుల కార్యాలయాలకు తొమ్మిది లక్షల చదరపు అడుగులు అవసరమని తేల్చారు. అయితే వెలగపూడిలో నిర్మించే భవనాల్లో సచివాలయం, అసెంబ్లీ, మండలి, సీఎం కార్యాలయం పోను శాఖాధిపతులకు ఏడు లక్షల చదరపు అడుగుల వసతి మాత్రమే అందుబాటులో ఉంటుం దని అంచనా వేశారు. అంటే మరో రెండు లక్షల చదరపు అడుగుల వసతిని శాఖాధిపతులు బయట చూసుకోవాల్సి ఉంటుందని నిర్ణయించారు. వాణిజ్య పన్నులు, రహదారులు, రాష్ట్ర ఆడిట్, వర్క్స్ అండ్ అకౌంట్స్, భాషా సాంస్కృతిక, కార్మిక సంక్షేమ విభాగాలు ఇప్పటికే బయట వసతిని సమకూర్చుకున్నాయి.