
‘పోలీసు స్కాన్’
ఖాకీల పనితీరుకు ప్రజల మార్కులు
లా అండ్ ఆర్డర్‌కు 42 శాతం
స్పెషల్ బ్రాంచ్‌కు 70 శాతం
మొదటి స్థానంలో కాలాపత్తర్
చివరి స్థానంలో మాదన్నపేట ఠాణా
సిటీబ్యూరో: పోలీసుల పనితీరుకు నగర ప్రజలు ఇచ్చిన మార్కుల ఫలితాలను పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మూల్యాంకనం చేస్తున్నారు. ప్రజలకు ఉత్తమ సేవలందించడంలో ముందు వరుసలో ఉన్న ఠాణాలతో పాటు పూర్తిగా వెనకబడిపోయిన ఠాణాలను సైతం ఆయన గుర్తించారు. పనితీరు సరిగా లేని ఠాణా సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పనితీరును మెరుగుపర్చుకుని ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని లేకుంటే బదిలీ వేటు పడుతుందని పేర్కొన్నారు. గతడాది ఆగస్టు 25 నుంచి ప్రత్యేక కాల్ సెంటర్ ద్వారా బాధితులు, ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి పోలీసుల పనితీరుపై ఆరా తీయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆరు నెలల పాటు సాగిన ఈ వ్యవహారంలో మూడు నెలలకు ఒకసారి ఠాణాల గ్రేడింగ్‌ను తీశారు. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు శాంతి భద్రతల విభాగం పోలీసుల సేవలకు 42 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, స్పెషల్ బ్రాంచ్ విభాగం పనితీరుపై మాత్రం 70 శాతం మార్కులు వేశారు నగర పౌరులు. ప్రజలకు మేలైన సేవలందించడంలో మొదటి స్థానంలో సౌత్‌జోన్‌లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్ ఉండగా, చివరి స్థానాన్ని మాదన్నపేట దక్కించుకుంది.
ఆరా తీసి మార్కులు...
కాల్‌సెంటర్‌లో ప్రైవేటు వ్యక్తులుంటారు. వీరు బాధితులు/ఫిర్యాదుదారులకు నేరుగా ఫోన్ చేసి ‘‘ ఫిర్యాదు రాసేందుకు రాణాలో రిసెప్షనిస్టు సహకరించారా? లేదా?, ఫిర్యాదు స్వీకరించే సమయంలో పోలీసులు ఎలా వ్యవహరించారు, డబ్బు డిమాండ్ చేశారా, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారా, నిందితులను అరెస్టు చేశారా’’ అని అడుగుతారు. ఇలా సేకరించిన వివరాలతో పోలీసుల పని తీరుపై మూడు నెలలకు ఒకసారి ఠాణాలకు గ్రేడింగ్ ఇస్తారు. మొదటి మూడు నెలల్లో ఠాణాలకు సగటున 46 శాతం మార్కులు రాగా, రెండో దశలో 42 శాతం మార్కులు వచ్చాయి.
మొదటి మూడు స్థానాలు...
మొదటి దశ ఫలితాల్లో మొదటిస్థానంలో గోపాలపురం, రెండో స్థానంలో కాలాపత్తర్, ఎస్‌ఆర్‌నగర్, మూడో స్థానంలో తిరుమలగిరి ఠాణాలు వచ్చాయి. ఇక రెండో దశ ఫలితాల్లో మొదటిస్థానంలో కాలాపత్తర్, రెండో స్థానంలో కంచన్‌బాగ్, ఆసిఫ్‌నగర్, మూడో స్థానంలో బొల్లారం ఉంది.
చివరి మూడో స్థానంలో...
మొదటి దశ ఫలితాల్లో చివరి స్థానంలో 5 శాతంతో బేగంపేట మహిళా పీఎస్, 31 శాతంతో చంద్రాయణగుట్ట, 32 శాతంతో రెయిన్‌బజార్ ఉంది. రెండో దశ ఫలితాల్లో 31 శాతంతో మాదన్నపేట, 33 శాతంతో మలక్‌పేట, ఫలక్‌నుమా, 34 శాతంలో చాదర్‌ఘాట్ ఠాణాలు చివరి స్థానాల్లో నిలిచాయి.
ఎస్బీపై 70 శాతం సంతృప్తి...
స్పెషల్ బ్రాంచ్ విభాగం పోలీసు సేవలపై 70 శాతం ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. మొదటి దశలో ఇది కేవలం 42 శాతం మాత్రమే ఉండే. రెండో దశకు వచ్చేసరికి 27 శాతాన్ని పెంచుకుంది ఎస్బీ. రెండో దశలో 1442 మంది పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు కాల్‌సెంటర్ ద్వారా ఫోన్ చేయడంతో ఈ ఫలితాలు ఇలా వచ్చాయి. మొదటి దశలో ఓ అధికారి జీరో శాతం ఉండగా రెండో దశకు వచ్చే సరికి 70 శాతం మార్కులను సాధించడం గమనార్హం.
ట్రాఫిక్ విభాగంపై కూడా..
ఇప్పటి వరకు శాంతి భద్రతలు, స్పెషల్ బ్రాంచ్ విభాగాలపైనే ఫీడ్‌బ్యాక్ తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ట్రాఫిక్ విభాగంపై కూడా దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై కాల్‌సెంటర్ నుంచి ఫోన్ చేసే ప్రక్రియ వారం రోజుల క్రితం మొదలైంది.