కొనసాగుతున్న నిరసనలు..
- సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై సర్వత్రా ఆగ్రహం
- సాక్షికి బాసటగా నిలిచిన వామపక్షాలు
సాక్షి, నెట్‌వర్క్: సాక్షి టీవీప్రసారాలను నిలిపివేరుుంచిన చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లాలో సాగుతోన్న జర్నలిస్టుల ఉద్యమం రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. అనంతపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 15 మంది జర్నలిస్టులు, మీడియా ఎంప్లాయూస్ కూర్చున్నారు. టీడీపీ మినహా అన్ని పార్టీలు, పలు కుల, ప్రజా సంఘాల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. ‘ఉద్యమాలు, మీడియాపై ఆంక్షలు’ అన్న అంశంపై కాకినాడలో పౌరహక్కుల సంఘం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కొల్లూరి చెంగయ్య అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ నుంచి గాంధీనగర్‌లోని ధర్నాచౌక్ వరకు మాలమహానాడు నాయకులు ఆదివారం ప్రదర్శన నిర్వహించారు.
మీకు అనుకూలంగా లేకపోతే గొంతు నొక్కుతారా?
తనకు అనుకూలంగా లేని, ప్రభుత్వ అక్రమాలను వెలికితీసే మీడియా గొంతునొక్కేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ పది వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఆదివారం విజయవాడలో వామపక్ష పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ సాక్షిపై చంద్రబాబు అనుసరిస్తున్న నిర్బంధ వైఖరిని తప్పుబట్టారు.