నెలాఖరుకు కొంత రుణమాఫీ
- మూడో విడతపై మంత్రి పోచారం ప్రకటన
- మాఫీతో నిమిత్తం లేకుండా రైతుకు రుణాలివ్వాలని బ్యాంకులకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: మూడో విడత రుణమాఫీలో కొంత సొమ్మును ఈ నెలాఖరు వరకు బ్యాంకులకు చెల్లిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మూడోవిడత సొమ్మును రెండు దశలుగా చెల్లిస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో పంట రుణాలు, బీమా ప్రీమియం తదితర అంశాలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారధితో కలసి విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీ మూడో విడతలో సగం చెల్లిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘రుణమాఫీతో రైతులకు సంబంధం లేదు. అది పూర్తిగా ప్రభుత్వానికి, బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం. రుణమాఫీ పత్రాలను బ్యాంకులు ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు ఇచ్చాయి.
మిగిలిన రైతులకు కూడా వాటిని ఇవ్వాలని బ్యాంకులను కోరాం.’ అని మంత్రి చెప్పారు. ఆ మేరకు కిందిస్థాయి బ్యాంకు బ్రాంచీల వరకు ఒక లిఖిత పూర్వక లేఖను సోమవారం నాటికి పంపించాలని కోరామన్నారు. రైతుల నుంచి వసూలు చేసే బీమా ప్రీమియం సొమ్మును ఆన్‌లైన్లోనే బీమా కంపెనీలకు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. పత్తి బీమా ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల 14వ తేదీతో ముగిసినా... ఆ తేదీలోపు రైతులు తీసిన డీడీలను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయన్నారు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ వసూలు చేయకూడదని ఆయన బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. రూ.లక్ష నుంచి రూ. 3 లక్షలలోపు వారి నుంచి పావులా వడ్డీ వసూలు చేయాలని సూచించారు. ఈ విషయాలన్నింటినీ కిందిస్థాయి బ్యాంకులకు పంపే లేఖలో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బ్యాంకులు ఇప్పటివరకు 4.34 లక్షల మంది రైతులకు రూ. 2,340 కోట్ల ఖరీఫ్ పంట రుణాలు ఇచ్చాయని వెల్లడించారు. ఇప్పటివరకు 53 వేల మంది రైతులు పత్తి ప్రీమియం చెల్లించారన్నారు.
ప్రకటనలకు మోసపోవద్దు...
ప్రసార సాధనాల్లో పత్తి విత్తన కంపెనీల ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి మోసపోవద్దని మంత్రి పోచారం రైతులకు సూచించారు. పత్తి విస్తీర్ణాన్ని తగ్గించాలని... అందుకు ప్రత్యామ్నాయంగా ఏ విత్తనాన్నైనా తాము సిద్ధం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు అన్ని రకాల విత్తనాలు కలిపి 3.41 లక్షల క్వింటాళ్లు సబ్సిడీపై రైతులకు ఇచ్చినట్లు తెలిపారు. ఆలస్యమైనా జులై నుంచి వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణశాఖ చెబుతున్నందున రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.