బంజారాహిల్స్: ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనపై విచారణ బాధ్యతలను ప్రభుత్వం జేఎన్‌టీయూ నిపుణుల కమిటీకి అప్పగించడం పట్ల ఎఫ్‌ఎన్‌సీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నివేదికను బుట్టదాఖలు చేసేందుకే జేఎన్‌టీయూకు విచారణ బాధ్యతలు అప్పగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో సిటీలైట్స్ హోటల్ కుప్పకూలిన ఘట నలోనూ విచారణ చేపట్టిన జేఎన్‌టీయూ ఇంతవరకు నివేదిక అందజేయలేదన్నారు. విచారణ బాధ్యతలను ఇతరులకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల్లో గుబులు
ఎఫ్‌ఎన్‌సీసీ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్–10ఏ, సర్కిల్–10బి అధికారుల్లో గుబులు మొదలైంది. ఆయా సర్కిళ్ల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులందడంతో వాటిపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుమతులు తీసుకున్న వారి జాబితా ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో సర్కిల్–10 పరిధిలోని డీఎంసీలు, టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శేఖర్‌రెడ్డి, సెక్షన్ అధికారి మల్లీశ్వర్‌ను సస్పెండ్ చేశారు. ఇటీవల ఏఎంహెచ్‌వో కూడా సస్పెన్షన్‌కు గురికావడంతో ఈ రెండు సర్కిల్ కార్యాలయాలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో వాటిని ప్రక్షాళన చేయాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరు ఉప కమిషనర్లతోపాటు ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు, ఏఎంహెచ్‌వోలపై బదిలీ వేటు పడనున్నట్లు సమాచారం.
నోటీసుల జారీ
నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో కాంట్రాక్టర్ కొండల్‌రావు, సైట్ ఇంజనీర్ సుధాకర్‌రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ బాలరాజులను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం విచారించారు. ఇందులో భాగంగా ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కే.ఎస్.రామారావుతో పాటు కార్యదర్శిని విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.