
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు తాజాగా సన్మానం చేసి గౌరవించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు ప్రెసిడెంట్ ఆదిశేష గిరి, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణతో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గడ్డం ప్రసాద్‌కు FNCC ప్రెసిడెంట్, సెక్రటరీ పుష్పగుచ్చము ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.
ప్రొడ్యూసర్, FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి FNCCకి విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ప్రత్యేకంగా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఆపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. తనను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. FNCC ద్వారా ఇక్కడికి రావడమే కాకుండా తన స్నేహితుల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. FNCC కి తన వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని ఆయన తెలియచేశారు. ఇలా తనను ఆహ్వానించి గౌరవించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.