పట్టుబడ్డ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు
చాంద్రాయణగుట్ట: ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న ఓ ఘరానా గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను శాలిబండ పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. చోరీ సొత్తు తాకట్టుపెట్టడానికి వచ్చిన వీరు అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ, శాలిబండ అదనపు ఇన్‌స్పెక్టర్ నగేష్‌తో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... లాల్‌దర్వాజాకు చెందిన సంగీత (36) ఈ ఏడాది ఫిబ్రవరి 22న సంగారెడ్డిలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో చార్మినార్ వరకు బస్సులో వచ్చింది. అక్కడి నుంచి లాల్‌దర్వాజా రావడానికి ఆటో ఎక్కగా... ఇద్దరు మహిళలు అదే ఆటోలో ఎక్కారు. సంగీత పక్కన కూర్చున్న వారు ఆమెను అటు.. ఇటు నెట్టుతూ దృష్టి మళ్లించి బ్యాగ్ చోరీ చేశారు. ఆ బ్యాగ్‌లో 16 తులాల బంగారు నగలు ఉన్నాయి. శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్ షాప్ వద్ద సంగీత ఆటో దిగగా.. వెంటనే వారు కూడా దిగి వెళ్లిపోయారు. అనంతరం తన బ్యాగ్ చోరీకి గురైందని గుర్తించిన బాధితురాలు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు సంగీత ఆటో దిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు మహిళలు బ్యాగ్ చోరీ చేసినట్టు గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం ఇద్దరు మహిళలు లాల్‌దర్వాజా మోడ్ వద్ద నగలతో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... ఓ ఘరానా దొంగల ముఠాకు చెందిన అక్కాచెల్లెళ్లు కావడి సరోజ (38), మేకల దుర్గ(40) అని తేలింది. వీరిది కడపజిల్లా సాయింపేట. పలుసార్లు జైలుకెళ్లి వచ్చారు. కాగా, ఆటోలో సంగీత నగలను చోరీ చేసింది వీరేనని తేలింది. అప్పట్లో చోరీ చేసిన నగలను ఇప్పుడు తాకట్టు పెట్టడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. ఇద్దరి వద్ద నుంచి 13.1 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తాకట్టు పెట్టడానికి వచ్చి చిక్కారు !
Published Sat, Dec 19 2015 12:07 AM | Last Updated on Sat, Sep 29 2018 5:55 PM
Advertisement
Advertisement