- మనస్థాపంతో స్నేహితుని ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ
నగరంలోని కూకట్‌పల్లి మూసాపేటలో బుధవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు స్నేహితులను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ(28) అనే యువకుడు మృతిచెందాడు. స్నేహితుని మరణాన్ని జీర్ణించుకోలేని రమేష్(28) భరత్‌నగర్ రైలు పట్టాలపై ఆత్మహత్యచేసుకున్నారు. హరికృష్ణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా రమేష్ శ్రీశ్రీ హోలిస్టిక్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు.
ఇద్దరూ గుంటురు జిల్లా కారెంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందినవారు. హరికృష్ణ, రమేష్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. హరికృష్ణ కొన్ని నెలల క్రితం మలేషియాలో ఉద్యోగం చేసి కొద్దిరోజులక్రితం నగరంలో ఉద్యోగం రాగా కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీ శ్రీవేంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో తన స్నేహితుడు రమేష్‌తో కలిసి ఉంటున్నాడు.
మంగళవారం రాత్రి బయటకు వెళ్లిన ఇద్దరూ అర్థరాత్రి దాటాక బైక్‌పై హాస్టల్‌కు వస్తుండగా మూసాపేట వద్ద లారీ ఢీకొంది. బైక్ వెనుక కూర్చున్న హరికృష్ణ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. కళ్లముందే స్నేహితుడు మృతిచెందడంతో తట్టుకోలేని రమేష్ సమీపంలోని భరత్‌నగర్ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారు ఉంటున్న హాస్టల్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రమేష్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హరికృష్ణ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.