రూ. కోటిన్నర కొట్టేశారు...
ఏటీఎంలో డబ్బు పెట్టే ఏజెన్సీ సిబ్బంది చేతివాటం
కాజేసిన డబ్బుతో గుర్రపు పందాలు
నాచారం: ఏటీఎంలో డబ్బును నింపే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు ఆధునిక టెక్నాలజీలోని లొసుగులను తమకు అనుకూలంగా ఉపయోగించుకొని కొత్త తరహా మోసానికి తెరలేపారు. సుమారు కోటిన్నర నొక్కేసి చివరకు నాచారం పోలీసులకు చిక్కారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్ రూట్లలో 15 ఏటీఎంల్లో డబ్బులు పెట్టే భాధ్యత ఓ ప్రైవేట్ ఏజెన్సీ తీసుకుంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమకు తెలిసిన సీక్రేట్ కోడ్‌తో ఏటీఎంను తెరిచి అందులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. ఆ తమ కార్యాలయానికి డబ్బు డిపాజిట్ చేసినట్టు ఎస్‌ఎంఎస్ పంపుతున్నారు. తర్వాత అదే కోడ్‌ను ఉపయోగించి గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తిరిగి డ్రా చేస్తున్నారు. ఇలా కాజేసిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతున్నారు. రోజూ ఇలా డబ్బు కాజేస్తూ దాదాపు రూ. కోటిన్నరకు పైగా ఖర్చు చేశారు.
మోసం బయటపడింది ఇలా...
ప్రతి రోజూ నమ్మకంగా డబ్బు ఏటీఎంలో ఉంచుతున్న ఉద్యోగులు సక్రమంగా మేసేజ్‌లు పంపుతున్నారు. దీంతో ఎక్కడ ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, జనవరి నుంచి మార్చి నెల వరకు డిపాజిట్ చేసిన డబ్బుపై ఆడిట్ చేయగా లెక్కల్లో భారీగా తేడా వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బ్యాంక్‌లు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దాదాపు రూ.కోటిన్నర వరకు మోసం జరిగినట్లు తెలియడంతో అనుమానితులైన నలుగురు ఉద్యోగులను నాచారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.