‘స్మార్ట్’గా దోచేస్తారు! | If the account is not affected by the cloning of empty | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’గా దోచేస్తారు!

Published Wed, Nov 12 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

‘స్మార్ట్’గా దోచేస్తారు!

‘స్మార్ట్’గా దోచేస్తారు!

క్లోనింగ్ బారిన పడితే మన ఖాతా ఖాళీ..
టెక్నాలజీ వినియోగంలో పైచేయి సాధిస్తున్న అక్రమార్కులు
డూప్లికేట్ కార్డులతో డబ్బులు స్వాహా
ఏటీఎం కేంద్రాల్లో పొంచి ఉన్న ముప్పు
అప్రమత్తంగా ఉంటేనే అన్ని విధాలా మేలు

 
డబ్బులు ఇంట్లో ఉంటే భద్రత ఉండదని ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాల్లో వేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగుల జీతాలను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాయి. ఖాతాలో డబ్బులు ఉండడంతో అవసరమైనప్పుడు ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే వెలుసుబాటుంది. అలా ఏటీఎం మనిషి నిత్య జీవితంలో ఓ భాగమైంది. ఇలా అందరు సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకెళ్తుంటే దొంగలు సైతం తామేమీ తక్కువా? అన్నట్టుగా మనకంటే ఓ అడుగు ముందుకేసి టెక్నాలజీని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. మన ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తూ డబ్బులను ఎంచక్కా దోచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు  చూశాయి.                  
  - పంజగుట్ట
 
ముంబైకి చెందిన ఏడుగురు స్నేహితులు. వీరిలో చదువు రాని వారితోపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులూ ఉన్నారు. కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే కోరిక వీరిలో బలంగా నాటుకుంది. చోరీలే ఇందుకు సరైన మార్గమని భావించారు. ఎవరికీ అనుమానం రాకుండా ‘స్మార్ట్’గా దోచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నకిలీ డెబిట్ కార్డులను సృష్టించి ఏటీఎంల ద్వారా డబ్బులు కాజేసేందుకు పథకం రచించారు. గత ఆదివారం సాయంత్రం నగరంలోని రాజ్‌భవన్ రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్‌అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్‌శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సదరు నిందితులపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో సుమారు 32 కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా వీరిపై కేసులు ఉన్నాయి. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.  
 
కార్డుల క్లోనింగ్ విధానం...
 
ఇందుకోసం మ్యాగ్నటిక్ రిఫ్లికా ఆఫ్ ఏటీఎం కార్డ్ స్లాట్ అనే యంత్రాన్ని తయారు చేశారు. రిఫ్లికా అనేది తొడుగు. దీన్ని ఏటీఎం సెంటర్‌లో ఏటీఎం కార్డు లోనికి వెళ్లే చోట గమ్‌తో అతికిస్తారు. రిఫ్లికా అతికించే ముందే అందులో ఓ సాఫ్ట్‌వేర్ చిప్, అది పనిచేసేందుకు బ్యాటరీని అమరుస్తారు. సరిగ్గా మన ఏటీఎం పిన్ నంబర్ ఎంటర్‌చేసే కీ ప్యాడ్‌కు పైన ఓ పెన్‌డ్రైవ్, దానికి 16 జీబీ మెమోరి కార్డు, 8 మెగా పిక్సల్ సెల్‌ఫోన్‌లో వినియోగించే చిన్న కెమెరా ఏర్పాటు చేసి దాన్ని గమ్ స్టిక్‌తో అతికిస్తారు. రిఫ్లికాలో ఉన్న బ్యాటరీ సుమారు 6 గంటలు పనిచేస్తుంది. ఖాతాదారుడు వచ్చి తన కార్డును ఏటీఎం మిషన్‌లో పెట్టగానే రిఫ్లికాలో ఉన్న సాఫ్ట్‌వేర్ ద్వారా కార్డుపై ఉండే 18 అంకెలు అందులో ఫీడ్ అవుతాయి. ఖాతాదారుడు పిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో పైన అమర్చిన కెమెరా షూట్ చేస్తుంది. ఆరు గంటల్లో ఆ ఏటీఎం సెంటర్‌కు ఎంతమంది వస్తే అంతమందికి చెందిన పూర్తి డేటా కెమెరా, రిఫ్లికాలో ఫీడ్ అవుతుంది.
 
గోవాలో నకిలీ కార్డుల తయారీ..

 
రిఫ్లికా, కెమెరా ద్వారా సేకరించిన డేటాను గోవాకు తీసుకెళ్తారు. క్లోనింగ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి వాటిపై అవే నంబర్లు ముద్రిస్తారు. సదరు నంబర్‌కు ఉన్న పిన్ నంబర్‌ను కూడా ఓ పేపర్‌పై రాసి నకిలీ ఏటీఎంకు అంటిస్తారు. అలా ఒక్కోసారి సుమారు 70 నుంచి 100 వరకు నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేయిస్తారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తారు.
 
ముంబై ముఠా నేరాల చిట్టా...
 
2012లో మొదటిసారి గోవాలో ఓ బ్యాంక్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి 70 నకి లీ ఏటీఎంలు తయారు చేయించారు. వాటిని గోవాతోపాటు హైదరాబాద్‌కు తీసుకొచ్చి నగరంలోని వివిధ బ్యాంకుల్లో సుమారు రూ.12 లక్షలు డ్రా చేశారు. 2014 జనవరిలో నగరంలోని లైఫ్‌స్టైల్ భవనంలో ఉన్న ఓ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 60 నకిలీ ఏటీఎం కార్డులు తయారు చేసి హైదరాబాద్‌లో సుమారు రూ.7 లక్షలు డ్రా చేశారు.  2014 మార్చిలో రాజ్‌భవన్ రోడ్డులోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో రిఫ్లికా అమర్చి సుమారు 100 కార్డులు తయారు చేసి ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.10 లక్షలు డ్రా చేశారు.

తాజాగా గత ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌రోడ్డులో ఏటీఎం వద్ద అనుమానంగా తిరుగుతున్న ముంబైకి చెందిన హైదర్‌అలీ అలియాస్ అజ్జు, అవిత్ అశోక్‌శెట్టిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పై వివరాలను వెల్లడించారు. మిగిలిన ఐదుగురితోపాటు హైదరాబాద్‌లో ఈ గ్యాంగ్‌కు షెల్టర్ ఇచ్చే జాఫర్ హఫీజ్ ఖాన్‌లను త్వరలో పట్టుకుంటామని పంజగుట్ట ఎసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.  
 
ఈ సూచనలు పాటించండి మరి...
 
ఏటీఎం సెంటర్లలో అప్రమత్తంగా ఉండాలి.
మిషన్ కీబోర్డుపైన ఏవైనా కెమెరాలు ఉన్నాయేమో ఓ సారి చూసుకోవాలి. ఠీపిన్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో జాగ్రత్త అవసరం.
రద్దీగా ఉండే ప్రాంతాల్లోని ఏటీఎంలకు వెళ్లడమే కొంతవరకు బెటర్. ఠీసెక్యూరిటీ గార్డు ఉన్న సెంటర్‌కే వెళ్లాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement