
మార్స్ రహస్యాలు మిగిలే ఉన్నాయి!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఇతర గ్రహాల అన్వేషణ, పరి శోధనలపైనే కాకుండా భూమ్మీద మనిషి మనుగడను ప్రశ్నార్థకం
♦ 2030 నాటికి మానవ ఆవాసం.. 2018లో మార్స్‌పైకి ల్యాండర్
♦ అంతర్భాగం,కంపనాలపై పరిశోధనలు
♦ భూకంపాలు, సునామీల అధ్యయనానికి ఇస్రోతో చర్చలు
♦ ‘నిసార్’ పేరుతో సంయుక్తంగా ఉపగ్రహ రూపకల్పన
♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జేపీఎల్ డిప్యూటీ డెరైక్టర్ ల్యారీ జేమ్స్
సాక్షి, హైదరాబాద్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఇతర గ్రహాల అన్వేషణ, పరి శోధనలపైనే కాకుండా భూమ్మీద మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేసే భూతాపోన్నతి, వాతావరణ మార్పులు వంటి అంశాలపైనా అనేక ప్రయోగాలు చేస్తోందని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ(జేపీఎల్) డిప్యూటీ డెరైక్టర్ ల్యారీ జేమ్స్ స్పష్టం చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)తో చర్చల కోసం భారత్ వచ్చిన ఆయన హైదరాబాద్‌లో ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలపై ‘సాక్షి’ ప్రశ్నలకు ల్యారీ జేమ్స్ సమాధానాలు ఆయన మాటల్లోనే..
అంగారకుడిపై ఆవాసం..
2030 నాటికల్లా అరుణ గ్రహంపై మానవ ఆవాసం ఏర్పరచుకోవాలన్నది నాసా లక్ష్యం. దీనికి సన్నాహకంగా వివిధ టెక్నాలజీలను పరీక్షించాల్సి ఉంది. ఇందుకోసం జాబిల్లి సాయం తీసుకుంటాం. 2018లో అంగారకుడిపైకి ఓ ల్యాండర్‌ను పంపుతాం. అంగారకుడి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ల్యాండర్ ద్వారా అంగారకుడి నేల అంతర్భాగం ఎలా ఉందో పరిశీలిస్తాం. టెక్టానిక్ ప్లేట్లు.. తద్వారా ఆ గ్రహంపై వచ్చే భూకంపాలపై అధ్యయనం చేస్తాం. 2020లో ప్రయోగించే రోవర్ ద్వారా అక్కడి మట్టి నమూనాలను విశ్లేషించి, వాటిని భూమ్మీదకు తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తాం. అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా? ప్రస్తుతం సూక్ష్మజీవుల రూపంలో జీవం మనగలిగే పరిస్థితి ఉందా? అన్నది తెలుసుకోవాలి. మొత్తమ్మీద చూస్తే.. దీర్ఘకాలంలో మనిషికి ఈ గ్రహం మరో ఇల్లు అవుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంది.
ఇస్రోతో సంయుక్త ప్రాజెక్టులు..
అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి నాసా అనేక దేశాలతో కలసి పనిచేస్తోంది. వీటిల్లో ఇస్రో ఒకటి. సంక్లిష్టమైన రాడార్ వ్యవస్థల నిర్మాణంలో ఇస్రోకు ప్రత్యేక సామర్థ్యం ఉంది. ఈ కారణంగానే నాసా.. ఇస్రో భాగస్వామ్యంతో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వీటిల్లో ‘నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్(నిసార్) అత్యంత ప్రతిష్టాత్మకమైంది. భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి విపత్తులతోపాటు భూమికి సంబంధించిన అనేక విషయాలను స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఈ ఉపగ్రహం ఎంతో ఉపయోగపడుతుంది.
వాతావరణ మార్పులు, భూతాపోన్నతిపై..
నానాటికీ పెరుగుతున్న భూతాపోన్నతి(గ్లోబర్ వార్మింగ్), వాతావరణ మార్పులను సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకునేందుకు నాసా ఇప్పటికే అనేక ప్రాజెక్టులు చేపట్టింది. నిజానికి 2014ను ‘ఇయర్ ఆఫ్ ఎర్త్’గా ప్రకటించిందంటేనే నాసా దీనికి ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భూ వాతావరణాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించేందుకు, కాలుష్యకారక బొగ్గుపులుసు వాయువు మోతాదును ఆకాశం నుంచే గుర్తించేందుకూ ఏర్పాట్లు చేశాం. దీంతోపాటే భూమి మొత్తమ్మీద నేలలోని తేమ శాతాన్ని దూరం నుంచే అంచనా కట్టేందుకు తగ్గట్టుగా ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాం.
సుదూర గ్రహాలే లక్ష్యం..
భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించడం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు, వ్యోమగాముల రవాణా వంటి అంశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి.. సుదూర గ్రహాల పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నాసా భావిస్తోంది. సౌరకుటుంబానికి ఆవల ఉన్న అనేక గ్రహాలను ఇప్పటికే గుర్తించాం. వీటిల్లో కొన్ని భూమిలాంటివి ఉన్నాయి. వీటన్నింటి మీద అధ్యయనం జరగాల్సి ఉంది. గురు, శని గ్రహ ఉపగ్రహాల్లో భారీ ఎత్తున నీరు ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. భూమిపై ఉండే నీటికి రెండు మూడు రెట్లు ఎక్కువ నీరు టైటన్, యురోపా ఉపగ్రహాలపై ఉన్నట్లు అంచనా. వీటిని పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. నాసా అభివృద్ధి చేస్తున్న ఓరియన్ ఇంజిన్ ద్వారా ఈ గ్రహాలను అతితక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఏర్పడనుంది.