ఆందోళనలో వేల మంది పెన్షనర్లు
♦ 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి వరకు రిటైరైన
♦ 10 వేల మంది వారికి వర్తించని
♦ పదో పీఆర్‌సీ గ్రాట్యుటీ పెంపు
♦ ఒక్కొక్కరికీ రూ. 4 లక్షల చొప్పున నష్టం
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్‌సీ ప్రయోజనాల వర్తింపులో వేల మంది పెన్షనర్లు అన్యాయానికి గురయ్యారు. 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి నాటికి రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ వర్తించకపోవడంతో ఒక్కొక్కరూ రూ. 4 లక్షల చొప్పున నష్టపోయారు. దీంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడినప్పటికీ పదో పీఆర్‌సీ సిఫార సులను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేయలేకపోయింది. దీనిపై ఉద్యోగుల ఆందోళనల ఫలితంగా 2015 మార్చి నుంచి పీఆర్‌సీని ఉద్యోగులకు నగదు రూపంలో వర్తింపజేసింది.
అంటే 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలపాటు పీఆర్‌సీని నోషనల్‌గానే (రికార్డుల్లోనే ఉంటుంది) ఇచ్చింది. కానీ గ్రాట్యుటీ విషయంలో పెన్షనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పదో పీఆర్‌సీ చైర్మన్ అగర్వాల్ సిఫారసుల ప్రకారం.. రిటైరైన ఉద్యోగులకు గతంలో ఉన్న రూ. 8 లక్షల గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచారు. అయితే ఈ పెంపును ప్రభుత్వం 2015 మార్చి తరువాత నుంచి రిటైరైన వారికే వర్తింపజేసింది. అంతకుముందు 9 నెలల కాలంలో రిటైరైన వారికి రూ. 8 లక్షల గ్రాట్యుటీనే వర్తింపజేసింది. దీంతో ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి రూ. 4 ల క్షల చొప్పున నష్టపోయారు. ఈ నేపథ్యంలో తమకు కూడా రూ. 12 లక్షల గ్రాట్యుటీని వర్తింపజేయాలని, నష్టపోయిన గ్రాట్యుటీ ఇవ్వాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్, టీచర్స్ అసోసియేషన్ చైర్మన్ పి.వెంకట్‌రెడ్డి, అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ 9 నెలల కాలంలో సుమారు 10 వేల మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేశారని...అందువల్ల ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కోరారు.