హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారంటూ గురువారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ పరిధిలోని బీజేఆర్‌నగర్ బస్తీకి చెందిన ఆర్.శివ(11) స్థానిక గీతాంజలి హైస్కూల్‌లో నాలుగో తరగతి, అలాగే దుర్గాప్రసాద్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. జ్ఞానీ జైల్‌సింగ్‌నగర్ బస్తీవాసి పవన్(14) స్థానిక వివేకానంద గ్రామర్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు.
వీరు ముగ్గురూ స్నేహితులు. బుధవారం సాయంత్రం ఆడుకుంటామని బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వీరి తల్లిదండ్రులు రాత్రంతా గాలించిన ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం ఉదయం తమ పిల్లలు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మిస్సింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు.