
నగరంలో గాలివాన బీభత్సం
హైదరాబాద్: నగరంలో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులతో ప్రారంభమైన వాన ధాటికి దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, కర్మాన్ ఘాట్, చైతన్యపురి, బేగంపేట, బంజారాహిల్స్ లలో చెట్లు నేల కూలాయి. చెట్లు కూలి వాహనాల మీద పడటంతో కార్లు, బైక్ లు భారీగా ధ్వంసమయ్యాయి. అమీర్‌పేట నుంచి ఎస్‌ఆర్‌నగర్, పంజగుట్ట ప్రాంతాల్లో చెట్లు కూలడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
బంజారాహిల్స్ లో బస్టాప్ మీద చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సనత్‌నగర్ బస్టాపు సమీపంలోని ఓ దుకాణం మీద కూడా ఓ చెట్టు కూలింది. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగలేదు.