‘కోత’ వేస్తే కబురందిస్తారు | Timings of electricity cuts information in the form of SMS | Sakshi
Sakshi News home page

‘కోత’ వేస్తే కబురందిస్తారు

Published Mon, Jan 9 2017 3:52 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

‘కోత’ వేస్తే కబురందిస్తారు - Sakshi

‘కోత’ వేస్తే కబురందిస్తారు

ఎస్‌ఎంఎస్‌ రూపంలో విద్యుత్‌ కోతల వేళలు.. బిల్లింగ్‌ సమాచారం
హైదరాబాద్‌ నార్త్‌ సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా అమలు


సాక్షి, హైదరాబాద్‌: కరెంట్‌ కోతల వేళల గురించి గ్రేటర్‌ వినియోగదారులకు సంక్షిప్త సమాచారం అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (సీపీడీసీఎల్‌) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నార్త్‌ సర్కిల్‌ పరిధిలో దీన్ని అమలు చేస్తోంది. తద్వారా ఈ సర్కిల్‌ పరిధిలోని సుమారు 8 లక్షల మంది వినియోగ దారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏ రోజు.. ఏ సమయంలో కరెంట్‌ సరఫరా బంద్‌ అవుతుంది... తిరిగి ఎన్ని గంటలకు వస్తుందన్న సమాచారంతో పాటు నెలసరి బిల్లు.. చెల్లింపులకున్న తుదిగడువు వంటి వివరాలనూ అందించనుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ విధానాన్ని తాజాగా నగరంలో అమలు చేయాలని సీపీడీసీఎల్‌ నిర్ణయించింది.

భవిష్యత్తులో మరిన్ని సర్కిళ్లకు...
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 34 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, 40 వేల చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లున్నాయి. ట్రాన్స్‌మిషన్, సరఫరా వ్యవస్థలో నిత్యం ఏదో ఒక సాంకేతిక సమస్య తలెత్తుతుంది. ఈ సమయంలో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. పోయిన కరెంట్‌ మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి నీటి సరఫరా, రోజువారీ కార్యకలాపాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే కోతల వేళలు ముందే తెలిస్తే వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఆలోచనతో 2012–13లోనే ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారుల ఫోన్‌ నంబర్లను సీపీడీసీఎల్‌ సేకరించింది. డిమాండ్‌కు తగిన విద్యుత్‌ సరఫరా కాకపోవడంతో అప్పట్లో ఇది సాధ్యం కాలేదు.

ప్రస్తుతంఅవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఎంఎస్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో హైదరాబాద్‌ నార్త్‌ సర్కిల్‌ పరిధిలోని బంజారాహిల్స్, అమీర్‌ పేట్, ఎర్రగడ్డ, బేగంపేట్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, గ్రీన్‌లాండ్స్, ప్యారడైజ్‌ ఫీడర్లలో ప్రయోగాత్మకంగా ఈ సేవలను అందిస్తోంది. గత రెండు రోజుల నుంచి ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ కోతల వేళలు.. బిల్లింగ్‌ వివరాలను వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతుంది. ఇక్కడ ఫలితాలను బట్టి భవిష్యత్తులో ఇతర సర్కిళ్లకు దీన్ని విస్తరింప జేయాలని నిర్ణయించింది.

ఎస్‌ఎంఎస్‌ చూపిస్తే చాలు...
తాజా సేవలతో విద్యుత్‌ రీడింగ్‌ నమోదు చేసిన వెంటనే వినియోగదారుని ఫోన్‌కు బిల్లు వివరాలు, గడువు తేదీ వంటివి చేరుతాయి. గడువుకు మూడు రోజుల ముందు కూడా అలర్ట్‌ వస్తుంది. చాలామంది ఇప్పుడు చివరి రోజు ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. ఇవి డిస్కం ఖాతాలో చేరే సరికి 48 గంటలు పడుతుంది. ఈలోపే స్థానిక లైన్‌మెన్లు వారి ఇంటి కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారు. ఎస్‌ఎంఎస్‌ సేవలతో ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి. బిల్లు చెల్లించిన వెంటనే ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. సంబంధిత సిబ్బంది, లైన్‌మన్‌కు దాన్ని చూపిస్తే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement