నేడు పాలీసెట్ | Today is a paliset | Sakshi
Sakshi News home page

నేడు పాలీసెట్

Published Thu, Apr 21 2016 4:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

నేడు పాలీసెట్

నేడు పాలీసెట్

♦ యథావిధిగా పరీక్ష నిర్వహణకు సహకరిస్తామన్న యాజమాన్యాలు
♦ హాజరుకానున్న అభ్యర్థులు 1,27,951 మంది
♦ గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
♦ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
♦ 10 రోజుల్లో ఫలితాలు.. మేలో కౌన్సెలింగ్.. జూన్ 9 నుంచి తరగతులు
 
 సాక్షి, హైదరాబాద్:
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్-2016 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా గురువారం (ఈనెల 21న) జరగనుంది. పరీక్ష నిర్వహణకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ముందుకు వచ్చాయని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సాంకేతిక విద్య డెరైక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. హైదరాబాద్ సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 54 ప్రభుత్వ, 166 ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 54 వేల సీట్ల భర్తీకి పాలిసెట్‌ను నిర్వహిస్తున్నామని... 1,27,951 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు.

పరీక్ష నిర్వహణకు ప్రైవేటు కాలేజీల్లో 209, ప్రభుత్వ కాలేజీల్లో 79 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష గురువారం ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు జరుగుతుందని.. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష హాల్లోకి వెళ్లాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్‌లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లవద్దని సూచించారు. పది రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామన్నారు.

 ప్రవేశాల జాప్యంతో 50% డ్రాపవుట్స్
 ఏటా పాలిటెక్నిక్ ప్రవేశాలు ఆలస్యం అవుతుండటం వల్ల గ్రామీణ విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని... 40 శాతం నుంచి 50 శాతం వరకు డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్నారని ఎంవీ రెడ్డి వివరించారు. దీంతో ఈసారి పాలీసెట్‌ను అన్నింటికంటే ముందుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు తాత్కాలిక షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేశామని.. వచ్చే నెల చివరి రెండు వారాల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని, ఆలోగా కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
 
 చేర్యాల, సాగర్‌లలో కొత్త కాలేజీలు
 వచ్చే విద్యా సంవత్సరంలో చేర్యాల, నాగార్జునసాగర్‌లలో రెండు కొత్త కాలేజీలను ప్రారంభించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిందని ఎంవీ రెడ్డి వెల్లడించారు. ఒక్కో కాలేజీలో రెండు బ్రాంచీల్లో కలిపి 240 చొప్పున సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇక సికింద్రాబాద్, హుస్నాబాద్‌లలో భవన నిర్మాణాలు పూర్తి కానందున ఏఐసీటీఈ అనుమతి రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement