అతగాడి అహానికి అతివ బలి | today spl for womens Violence Reverse Day | Sakshi
Sakshi News home page

అతగాడి అహానికి అతివ బలి

Published Mon, Nov 24 2014 11:42 PM | Last Updated on Tue, Aug 7 2018 4:29 PM

అతగాడి అహానికి అతివ బలి - Sakshi

అతగాడి అహానికి అతివ బలి

సాంకేతిక యుగంలో మహిళలు.. పురుషుడితో పోటీపడి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. అన్ని రంగాల్లోను విజయ కేతనం ఎగరేస్తున్నారు. కానీ పశు బలం ముందు ఓడిపోతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు వేస్తున్నా మృగాళ్ల దాడులు ఆగడం లేదు. అనేక చోట్ల మహిళలు, బాలికలపై ఏదో ఒక రూపంలో హింస కొనసాగుతునే ఉంది. మూడు నెలల క్రితం నగర శివారులో 30 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతాలపై పోలీసుల దర్యాప్తు సాగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ హతులు, హంతకుల వివరాలు లభ్యం కాలేదు. నగరంలో చోటుచేసుకుటున్న దారుణాలకు ఇవి ఉదాహరణ మాత్రమే.

నెల రోజుల క్రితం బండ్లగూడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని తనను ప్రేమించలేదని గొంతుకోసిన సంగతి తెలిసిందే. ఒకవైపు రాష్ర్ట రాజధాని హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు, మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం బలమైన చట్టాలను రూపొందిస్తోంది. మరోపక్క మహిళలపై హింస కొనసాగుతూనే ఉంది. చిన్నారుల నుంచి వయోధికుల వరకు ఏదో ఒక రూపంలో హింసకు గురవుతూనే ఉన్నారు. లోకం పోకడ తెలియన అమాయక పాపలను సైతం కాంతో కళ్లు మూసుకుపోయిన కాలనాగులు కాటేస్తున్నాయి. వారికి రక్షణ కల్పిచాల్సినవాడే భక్షణకు దిగుతున్నాడు. నేడు ‘మహిళలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం. 
             - సాక్షి,సిటీబ్యూరో
 
ఉక్కు చట్టాలు ఉన్నా కొనసాగుతున్న హింస
వేధింపులు, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం
పోలీసులను ఆశ్రయించేందుకు వెనుకంజ
మహిళలపై హింసా వ్యతిరేక దినం’ ప్రత్యేక కథనం
 
న్యాయమూర్తుల కొరత..
మరోపక్క దాఖలవుతున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పాత కేసులను పూర్తిచేయాలంటే, న్యాయమూర్తుల సంఖ్య పెరగాలి. ఏ నిష్పత్తిలో జడ్జీల సంఖ్య ఉండాలన్నదానిపై శాస్త్రీయత లేదు. ప్రస్తుతం జనాభా ప్రాతిపాధికనే న్యాయమూర్తుల సంఖ్యను లెక్కిస్తున్నారు. పది లక్షల జనాభాకు 10 నుంచి 15 మంది మాత్రమే న్యాయమూర్తులు ఉన్నారు. అదే అమెరికాలో 150 మంది దాకా ఉన్నారు. 2002 నాటి ఆలిండియా జడ్జీల కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, లా కమిషన్ సూచనల ప్రకారం పది లక్షల సంఖ్యకు 50 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు వేసి తద్వారా మహిళల కేసులను సత్వర పరిష్కారం చేసేందుకు వీలుంది. అయితే అందుకు తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేరు.

కొలిక్కిరాని వేల కేసులు
జంట పోలీసు కమిషనరేట్లలో 2011 నుంచి ఈ ఏడాది జూలై వరకు వివిధ రూపాల్లో మహిళలు ఎదుర్కొంటున్న హింసపై 14,050 కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6,732, సైబరాబాద్ కమిషనరేట్‌లో 7,318 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇంకా వేల సంఖ్యలో మహిళలు మౌనంగా హింసను భరిస్తున్నారు. వారిలో మృగాళ్ల హింసను ఎదిరించేందుకు ముందుకు రావడం లేదు. ఏమవుతుందోనని భయపడి కేసులు పెట్టలేకపోతున్నారు. మరోవైపు నిందితుల అరెస్టు, కోర్టు విచారణ, చార్జిషీట్ దాఖలు, శిక్షల అమలు నత్తనడకన సాగుతోంది.
 
అడుగడుగునా కఠిన పరీక్ష..
హైదరాబాద్ మహా నగరం అన్ని రంగాలకు అంతర్జాతీయ వేదిక. మహిళలు అన్నింటిలోను అద్భుతాలు సృష్టిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో గొప్ప నిపుణులుగా రాణిస్తున్నారు. కానీ పురుషాధిపత్య భావజాల ం, విలువల్లో ఆశించిన మార్పులు రాకపోవడం వల్ల ఇప్పటికీ మగాడి చేతుల్లో హింసకు గురవుతున్నారు. బలమైన చట్టాలు ఉన్నప్పటికీ అడుగడుగునా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హ త్యలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సమాజంలో అమ్మాయిలకు భద్రత ఉండదనే ఒకే ఒక్క కారణంతో చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు వెనుకాడుతున్నారు. అంటే ఇంటా, బయటా హింస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గృహహింస వ్యతిరేక చట్టం ఉన్నా అత్తింటి ఆరళ్లను ఎదిరించే సాహసం చేయలేకపోతున్నారు. ఒకవైపు మహిళా భద్రతా కమిటీ అనేక చర్యలు చేపట్టింది. సిటీ బస్సుల్లో భద్రత కోసం స్లైడ్ డోర్స్‌ను ప్రవేశపెట్టారు. పోలీసుల ‘షి’ బృందాలు రంగంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో సీసీ కెమెరాల నిఘా ఉంది. అయినా మహిళా ఉద్యోగులు నిర్భయంగా తిరగలేకపోతున్నారు. ఒంటరి ప్రయాణం అంటేనే భయపడుతున్నారు. సోషల్ మీడియా సైతం మహిళల భద్రతకు అనేక సవాళ్లు విసురుతోంది.
 
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు
నగరంలో మహిళల భద్రతపై పూర్తిగా దృష్టి సారించాము.  కళాశాలలు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ‘షీ టీమ్స్’ను రంగంలోకి దించాం. గృహహింస, వరకట్న కేసుల విషయంలో కూడా చొరవ తీసుకుంటున్నాం. వరకట్న కేసులలో ఫిర్యాదు రాగానే భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి ప్రత్యేక అధికారులతో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తరువాతే కేసు నమోదు చేస్తున్నాం. ఎక్కువ కేసులు కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కారం అవుతున్నాయి. ఇక వరకట్నం కేసులలో తప్పించుకు తిరుగుతున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేస్తున్నాం. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి.
 - స్వాతిలక్రా, అదనపు పోలీసు కమిషనర్

 
ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టు
మహిళలు తమ సమస్యలను ధైర్యంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఠాణాలోను మహిళా రిసెప్షనిస్టును ఏర్పాటు చేశాము. ముఖ్యంగా హైటెక్ సిటీ, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాలలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగులకు పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నాం. వారికి 24 గంటల ప్రయాణ  సౌకర్యం ఏర్పాటు చేశాం.

అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఉన్నాయి. ‘అభయ’ ఘటనలో నిందితులకు కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నాం. స్కూళ్లలో బాలికలపై వేధింపులను అరికట్టేందుకు ‘చైల్డ్ అబ్యూజ్ మేనేజింగ్ కమిటీ’ (సీఏఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల వేధింపులకు పాల్పడే వారు వెనకంజ వేయక తప్పదు.      
 - రమారాజేశ్వరి, మల్కాజ్‌గిరి డీసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement