నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం | Today, the AIIMS team to Nilofer | Sakshi
Sakshi News home page

నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం

Published Thu, Dec 17 2015 1:11 AM | Last Updated on Wed, Oct 17 2018 5:43 PM

నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం - Sakshi

నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం

వీణ-వాణిల శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాల పరిశీలన
 
 సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్-న్యూఢిల్లీ)కి చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో వైద్యుల బృందం నేడు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి రానుంది. అవిభక్త కవలలైన వీణ-వాణిల శస్త్రచికిత్సకు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై పరిశీలనకు ఈ బృందం వస్తున్నట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది  ఫిబ్రవరిలో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వైద్యులు డా.డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీల బృందం హైదరాబాద్‌కొచ్చి నీలోఫర్‌లో ఉన్న వీణ-వాణిలను పరిశీలించారు. ఐదు దశల్లో  శస్త్రచికిత్స నిర్వహించి వీళ్లిద్దరినీ వేరు చేస్తామని.. ఈ కవలలను లండన్‌కు తీసుకురావాలని అన్నారు.

ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. లండన్ వైద్యులను రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించింది. అంటే ఇప్పటికి సుమారు పది మాసాలు అయింది. తాజాగా ఎయిమ్స్ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో వీణ-వాణిలను పరిశీలించేందుకు ముగ్గురు వైద్యుల బృందం వస్తోంది. వీరికోసం నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. వీణ-వాణిలకు అన్ని వైద్య పరీక్షలు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం లండన్ వైద్యులతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement