'నీలోఫర్‌ను మిస్సవుతున్నాం'
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నామని అవిభక్త కవలలు వీణా-వాణి పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమని తరలించిన స్టేట్ హోం కూడా బాగానే ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీణా-వాణిలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణా-వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, వీణావాణీల కోసం నీలోఫర్ ఆస్పత్రి సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చామని, వారికి ఏ ఇబ్బంది కలుగకూండా చూసుకుంటామని స్టేట్ హోం డైరెక్టర్ లక్ష్మిదేవి తెలిపారు. అవిభక్త కవలలైన వీణా-వాణి విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వారిని జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది.