‘ఛత్తీస్’పై నేడు బహిరంగ విచారణ | Today, the public inquiry on Chhattis | Sakshi
Sakshi News home page

‘ఛత్తీస్’పై నేడు బహిరంగ విచారణ

Published Thu, Feb 11 2016 12:22 AM | Last Updated on Tue, May 29 2018 11:17 AM

‘ఛత్తీస్’పై నేడు బహిరంగ విచారణ - Sakshi

‘ఛత్తీస్’పై నేడు బహిరంగ విచారణ

♦ సింగరేణి భవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం
♦ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన పిటిషన్‌దారులు
♦ వెనక్కి తగ్గేందుకు     డిస్కంలు ససేమిరా
♦ విచారణకు రానున్న రఘు, కోదండరాం తదితరులు
 
 సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై గురువారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) బహిరంగ విచారణ నిర్వహించనుంది. లోపాలపుట్టగా ఉన్న ఈ  ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని పేర్కొంటూ విద్యుత్ రంగ నిపుణులు, విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు, ఎం.తిమ్మారెడ్డి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్ రావు, రిటైర్డ్ విద్యుత్ ఇంజనీర్ ఎల్.నారాయణరెడ్డి ఈఆర్‌సీలో అభ్యంతరాలు దాఖలు చేశారు.

కె.రఘు మినహా ఇతరులందరి అభ్యంతరాలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వివరణలు ఇచ్చాయి. అయితే తమ అభ్యంతరాలకు సూటిగా సమాధానం చెప్పకుండా నిబంధనలను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేశాయని డిస్కంల వివరణలపై పిటిషన్‌దారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందంపై వ్యక్తమైన అభ్యంతరాలు, డిస్కంల వివరణలపై ఈఆర్‌సీ గురువారం ఉదయం 11 గంటలకు సింగరేణి భవన్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ నేతృత్వంలోని బెంచ్ ఎదుట పిటిషన్‌దారులు, డిస్కంల యాజమాన్యాల మధ్య వాడివేడిగా వాదనలు జరగనున్నాయి.

ఈ విచారణకు కె.రఘు, ఎం.తిమ్మారెడ్డి, కోదండరాం, రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు ఎం.వేణుగోపాల్ రావు, రిటైర్డు విద్యుత్ ఇంజనీర్ ఎల్.నారాయణరెడ్డితో పాటు ఇతర ముఖ్యులు హాజరు కానున్నారు. 12 ఏళ్ల దీర్ఘకాలిక అవసరాల కోసం 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏ భవితవ్యంపై బహిరంగ విచారణ తర్వాత ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందంలో సవరణలు జరపాలని ఈఆర్‌సీ ఆదేశిస్తే మాత్రం.. రాష్ట్ర డిస్కంలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మేరకు సవరణలు చేయక తప్పని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ఛత్తీస్‌గఢ్ పీపీఏపై దాఖలైన అభ్యంతరాలు, వాటికి డిస్కంలు ఇచ్చిన వివరణలు ఇలా ఉన్నాయి..

► కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్లకుండా ఎంవోయూ ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? టెండర్లకు వెళ్తే ఇంత కన్నా తక్కువ ధరకు విద్యుత్ లభించే అవకాశం ఉండేది కదా?
 డిస్కంలు: వార్దా-మహేశ్వరం కారిడార్ బుకింగ్ కోసం పీపీఏ ఒప్పందం అవసరం. అందుకే ఈ ఒప్పందం.
► పీపీఏలో విద్యుత్ ధరల కనీస సమాచారం లేదు. ఈ ధరలను నియంత్రించే అధికారం తెలంగాణ ఈఆర్‌సీకి కట్టబెట్టకుండా ఛత్తీస్‌గఢ్ ఈఆర్‌సీకి ఎందుకు కట్టబెట్టారు?
 డిస్కంలు: టారిఫ్ నిబంధనల ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ధరల నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్‌సీ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర జెన్‌కో, ఎన్టీపీసీలతో జరిగే ఒప్పందాల్లో సైతం ధరలను పేర్కొనరు.
► విద్యుత్ కొనుగోలు చేసినా.. చేయకున్నా రూ.వందల కోట్ల స్థిర చార్జీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందంలో నిబంధనలు ఎందుకు ? భవిష్యత్తులో ఇంధన చార్జీలు అడ్డగోలుగా పెంచడానికి ఇది దారితీస్తుంది.
 డిస్కంలు: ఛత్తీస్‌గఢ్ నుంచి పూర్తిగా వెయ్యి మెగావాట్లు రాష్ట్రానికే తీసుకొచ్చేందుకే ఈ నిబంధనకు అంగీకరించాం.
► విద్యుత్ అమ్మకం ధరను రాష్ట్ర సరిహద్దుల వద్ద కాకుండా ఛత్తీస్‌గఢ్ ఉత్పత్తి సంస్థ సరిహద్దుల వద్ద నిర్ణయించేలా ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? దీంతో అక్కడ్నుంచే సరఫరా, పంపిణీ చార్జీలను మన రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. అక్కడి ప్రభుత్వం భవిష్యత్తులో పెంచే పన్నులు, సుంకాల భారాన్ని ఎందుకు ఒప్పుకున్నారు?
 డిస్కంలు: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విధించే పన్నులు, సుంకాల భారం రాష్ట్ర డిస్కంలపై పడడం వాస్తవమే. తెలంగాణ జెన్‌కో విషయంలో ఈఆర్‌సీ అనుమతిస్తున్న పన్నులు, సుంకాల తరహాల మాదిరే ఇవి అమలు కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement