నేడే కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు
♦ జంట జిల్లాల నుంచి హాజరుకానున్న
♦ 94,477 మంది అభ్యర్థులు
♦ అక్రమాల నిరోధానికి తొలిసారిగా
♦ ‘బయోమెట్రిక్’ అమలు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ర్ట పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జంట జిల్లాలో జరిగే ఈ పరీక్షలకు 94,477 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో 74 పరీక్ష కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్‌తో సహా 124 పరీక్ష కేంద్రాల్లో సకలసౌకర్యాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రథమ చికిత్స వైద్యసేవలు...తదితర వసతులు కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో 38,757 మంది, రంగారెడ్డి జిల్లాలో 55,720 మంది అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా. హైదరాబాద్‌లో మహిళలు 4,219 మంది, పురుషులు 30,528, మొత్తంగా 38,757 మంది, రంగారెడ్డి జిల్లాలో మహిళలు 9,460, పురుషులు 54,480 మంది మొత్తంగా 55,720 మంది హాజరుకానున్నారు.
గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి...
కానిస్టేబుల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఎగ్జామ్స్ నిర్వహించే సమయానికి గంట ముందే చేరుకోవాలి. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అధికారులు అమలుచేస్తున్నారు. అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు, సంతకాలు తీసుకోవడం ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థి పరీక్ష రాస్తున్నాడన్న విషయం అక్కడికక్కడే తెలిసిపోతుంది. అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు అనుమతించమని పోలీసులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.