పిలిపించుకుని మరీ అభినందనలు | top babus of ap government went to vijayawada to greet cm chandrababu on new year | Sakshi
Sakshi News home page

పిలిపించుకుని మరీ అభినందనలు

Published Fri, Jan 1 2016 9:30 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

పిలిపించుకుని మరీ అభినందనలు - Sakshi

పిలిపించుకుని మరీ అభినందనలు

- సీఎంకు నూతన వత్సర శుభాకాంక్షాలు తెలిపేందుకు బెజవాడకు వెళ్లాలంటూ ఆదేశాలు
- 12 గంటలకు మెస్సేజ్.. ఒంటిగంటకు వోల్వో బస్సు..
- ముఖ్యమంత్రి కార్యాలయం తీరుపై ఐఎఎస్‌ల విస్మయం

సాక్షి, హైదరాబాద్:
బహిరంగ సభలకు జనాన్ని వాహనాల్లో తరలించడం చూశాం గాని ముఖ్యమంత్రిని అభినందించేందుకు వోల్వో బస్సులు పెట్టి ఐఏఎస్‌లను తీసుకువెళ్లడం ఇంతకు ముందు చూసి ఉండం! ఆంగ్ల సంవత్సరాది రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించేందుకు హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లను పిలిపించుకున్న తీరే ఇందుకు నిదర్శనం. సీఎం సూచనతో ఇలా జరిగిందో లేక మార్కులు కొట్టేయాలనుకున్న వందిమాగదులు ఈ పని చేశారో తెలియదు గాని..

శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఐఏఎస్‌లందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. 'హైదరాబాద్‌లోని ఐఏఎస్‌లు అందరూ విజయవాడ వచ్చి ముఖ్యమంత్రిని అభినందించాలి. ఇందుకు తగిన రవాణా ఏర్పాట్లు జరిగాయి. సచివాలయం నుంచి వోల్వో బస్సు బయలుదేరుతుంది' అని ఎస్ఎంఎస్ సారాంశం. శనివారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమికి సమాయత్తమవుతున్న ఐఏఎస్‌లు.. ఈ ఎస్‌ఎంఎస్‌లతో విస్తుపోయారు. పిలిపించుకునిమరీ శుభాకాంక్షలు చెప్పించుకోవడమేమిటంటూ గుసగుసలాడారు.

ఓ ఐఏఎస్ అయితే తన ముందున్న మీడియా వాళ్లతో 'ఇంకా నయం, బహిరంగ సభలకు తోలే జనానికి ఇచ్చినట్టు ఓ బిర్యానీ ప్యాకెట్టు, క్వార్టర్ మందు ఇస్తామన్నారు కాదు' అంటూ జోక్ పేల్చారు. వోల్వో బస్సే అయినా విజయవాడ పోయి వచ్చేందుకు కనీసం 10 గంటలు పడుతుందని, మళ్లీ తెల్లవారుతూనే జన్మభూమి డ్యూటీలకు పోవాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నమ్మిన బంట్లు ఎవరో తమ పలుకుబడిని చూపించుకునేందుకు ఈ పని చేశారంటూ వాపోయారు.

సరే, ఇంత చేసినా ఆ బస్సులో ఆరుగురు అధికారులకు మించి బెజవాడకు పోలేదు. ఎక్కువ మంది విమానాల్లోనే వెళ్లారు. లింగరాజు ప్రాణిగ్రాహి, సిసోడియా, జేసీ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముద్దాడ రవిచంద్ర, అశోక్ ఈ బస్సులో వెళ్లగా మరికొందరు మొహం చాటేశారు. 'కేవలం ఆరుగురి కోసం 48 సీట్లున్న గరుడు బస్సును వేయడం వృథా.. ఇదేం నైతికత?' అంటూ సచివాలయంలో చర్చోపచర్చలు సాగాయి.

సీఎం ఒక్కరు వస్తే...
సీఎం ఒక్కరు హైదరాబాద్‌కు వస్తే ఇంతమంది అధికారులు విమానాల్లో, కార్లలో, గరుడ బస్సులో విజయవాడకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని, దీనివల్ల సర్కారు ఖజానాపై భారం తగ్గేదని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ‘కేవలం ఆరుగురి కోసం గరుడ బస్సు వేసి ఖాళీగా పంపుతున్నారు... ఉన్నతాధికారులు విమానాల్లో వెళ్లి రావడానికి అయ్యే ఖర్చంతా ఖజానా నుంచే చెల్లించాలి. సీఎం వస్తే ఈ వృథా ఖర్చు తప్పేది. అయినా చెప్పించుకోవాల్సిన అగత్యం ముఖ్యమంత్రికి వస్తే ఎలా? ఇక్కడే ఉంటే గతంలో లాగే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, అధికారులు వెళ్లి గ్రీటింగ్స్ చెప్పేవాళ్లు. ఎస్‌ఎంఎస్‌లు పెట్టి మరీ పిలిపించుకోవడం అనైతికమని ఉద్యోగులు చర్చించుకున్నారు. ఇదిలాఉంటే ఈ బస్సులో ఎక్కేవారిని చూడడం కోసం 30, 40 మంది అక్కడ గుమికూడడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement