గోల్డ్ స్మగ్లర్ ‘డబుల్ ధమాకా’
⇒ ఒకే సమయంలో రెండు రకాలుగా అక్రమ రవాణా
⇒ చెన్నై వాసిని పట్టుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ టీమ్
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. గతానికి భిన్నంగా అక్రమ రవాణా అవుతున్న పసిడిని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ఈ స్మగ్లర్ ‘రెండు రకాలు’గా బంగారం తీసుకువస్తూ చిక్కాడు. కస్టమ్స్ అధికారులు ఇతడి నుంచి రూ.59.10 లక్షల విలువైన రెండు కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు.
ఎల్‌ఈడీ లైట్లలో అమర్చి...
స్మగ్లర్లను కనిపెట్టడానికి కస్టమ్స్ అధికారులు కొన్ని దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి ప్రొఫైలింగ్ చేపడుతుంటారు. ఆ వ్యక్తి ఎంత కాలంలో, ఎన్నిసార్లు, ఏఏ దేశాల నుంచి వచ్చి వెళ్లాడనేది అధ్యయనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం టైగర్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో సింగపూర్ నుంచి వచ్చిన ఓ తమిళనాడు వాసిపై అనుమానం వచ్చింది. చెన్నైకు చెందిన ఇతగాడు గడిచిన కొన్ని నెలల్లో పదేపదే సింగపూర్ వెళ్లి వచ్చిన విషయాన్ని పాస్‌పోర్ట్ ఆధారంగా గుర్తించారు.
చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కో విమానాశ్రయం లో దిగుతుండటంతో అనుమానించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అదుపు లోకి తీసుకుంది. ఇతడు లగేజీలో 2 ఎల్‌ఈడీ లైట్లను తీసుకువచ్చాడు. తక్కువ ఖరీదైన ఈ తరహా లైట్లను విదేశాల నుంచి తీసుకురా వడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవడం తో వీటిని ఎంచుకున్నాడు. 800 గ్రాముల బంగారాన్ని 8 బిస్కెట్లుగా మార్చి ఆ లైట్ల వెనుక ఉండే భాగంగా అమర్చాడు. ఈ రెం డింటినీ ఎక్స్‌రే స్కానింగ్ ద్వారా పరిశీలించిన ఏఐయూ అధికారులు రొటీన్‌కు భిన్నమైన షేడ్స్ గుర్తించారు. దీంతో వాటిని విప్పి చూడగా బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అతడిని పూర్తిగా సోదా చేశారు. దీంతో ‘రెక్టమ్ కన్‌సీల్‌మెంట్’ను గుర్తించారు.
2 కేజీల బంగారం స్వాధీనం
సుదీర్ఘకాలం స్మగ్లర్లు, క్యారియర్లుగా పని చేసేవారు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సల ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేసుకుంటున్నా రు. ఇందులో గరిష్టంగా 2 కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉం టుంది. ఆదివారం చిక్కిన చెన్నై వాసి 1,200 గ్రాముల 12 బంగారం బిస్కెట్లను రెక్టమ్ కన్‌సీల్‌మెంట్ ద్వారా తీసుకువచ్చా డు. ఇతడి నుంచి 2 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల న్నరలో రెక్టమ్ కన్‌సీల్‌మెంట్‌కు చిక్కడం ఇది రెండోసారని అధికారులు చెబుతున్నారు.