బదిలీ కాని నగదు సబ్సిడీ దగా
ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీనివాస్ ఎల్పీజీ కనెక్షన్ ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైంది. గత నెలలో సిలిండర్ బుక్ చేయగానే సబ్సిడీ నగదు రూపంలో అడ్వాన్స్‌గా బ్యాంక్ ఖాతాలో రూ.435 జమ అయ్యాయి. వాటిని డ్రా చేసి, మిగతా డబ్బులు కలిపి సిలిండర్ డెలివరీ సమయంలో బిల్లు చెల్లించాడు. ఆపై ఈ నెల 2న మరోసారి బుక్ చేయగా.. ఈ నెల 16న గ్యాస్ సిలిండర్ డెలివరీ అయింది.
కానీ బ్యాంక్ ఖాతాలో మాత్రం సబ్సిడీ నగదు జమ కాలేదు. దీంతో పూర్తిస్థాయి రీఫిల్లింగ్ ఖరీదు రూ. 962 చెల్లించాల్సి వచ్చింది. బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు జమ కాని విషయాన్ని డీలర్‌కు చెబితే.. తమకు సంబంధం లేదన్నాడు. శ్రీనివాస్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమస్య కేవలం శ్రీనివాస్‌దే కాదు.. గ్రేటర్ హైదరాబాద్‌లో వేలాదిమందికి ఇటువంటి అనుభవమే ఎదురవుతోంది.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ నగదు రూపంలో బదిలీకి ఆదిలోనే అడ్డంకులు తప్పట్లేదు. ఎల్పీజీ ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన తొలిసారి సిలిండర్ బుక్ చేసినప్పుడు అడ్వాన్స్‌గా సబ్సిడీ నగదు రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ అయినా...
రెండోసారి బుక్ చేశాక మాత్రం ఏకంగా సిలిండర్ ఇంటికి డెలివరీ అయ్యాక కూడా సబ్సిడీ నగదు రూపంలో బ్యాంక్ ఖాతాలో జమ కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. గ్రేటర్‌లోని భారత్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ తదితరగృహ ఎల్పీజీ వినియోగదారులు 25.67 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో ఆధార్, బ్యాంక్ ఖాతాలతో పూర్తి స్థాయిలో అనుసంధానమైన వినియోగదారులు 9 లక్షల మందికి మించి లేరు. అందులో 4 లక్ష ల మంది వినియోగదారులకు రెండోసారి సబ్సి డీ నగదు రూపంలో బ్యాంక్ ఖాతాలో జమకాని దాఖలాలున్నాయి. దీంతో వినియోగదారులు సిలిండర్‌పై పూర్తి మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తోంది.
ఇదీ సమస్య...
ఎన్‌పీసీఐ (భారత జాతీయ చెల్లింపుల సంస్థ)కు ఈ వివరాలన్నీ అనుసంధానం కాకపోవటం వల్లే ప్రస్తుత సమస్య తలెత్తినట్టు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గృహ ఎల్పీజీ వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ నగదు బదిలీ కావట్లేదని గుర్తించారు. డొమెస్టిక్ వినియోగదారులు తన ఎల్పీజీతో అనుసంధానం కోసం ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాల వివరాలను డీలర్, బ్యాంకర్లకు సమర్పించాక.. డీలర్, బ్యాంకర్లు వాటిని అనుసంధానించి ఎన్‌పీసీఐకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది.
ఈ రెండింటి అనుసంధానం ఆధారంగా ఎన్‌పీసీఐ సబ్సిడీ నగదును వినియోగదారుడి బ్యాంక్ ఖాతాల్లోకి ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నేరుగా జమ చేస్తుంది. ప్రతి నెలా రీఫిల్లింగ్ కోసం సిలిండర్ బుక్ చేయగానే ఈ సబ్సిడీ నగదు నేరుగా సదరు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుంది. అయితే ఎల్పీజీ డీలర్లు ఆన్‌లైన్‌లో ఓఎంసీలకు అనుసంధానం చేసే సమయంలో సాంకేతిక తప్పిదం వల్ల నగదు బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యే విషయంలో అడ్డంకులు కలుగుతున్నాయి. ఈ సమస్య గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 45 శాతం మంది వినియోగదారులకు ఉంది.
బ్యాంకులో సబ్సిడీ డబ్బులు పడటం లేదు
నా ఎల్పీజీ కనెక్షన్ ఆధార్, బ్యాంక్‌తో అనుసంధానమైంది. మొదటి నెల గ్యాస్ బుక్ చేయగానే అడ్వాన్స్‌గా సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. సిలిండర్ కూడా తొందరగా వచ్చింది. రెండోసారి బుక్ చేస్తే సిలిండర్ పూర్తిస్థాయి బిల్లుతో డెలివరీ అయింది. కానీ, సబ్సిడీ నగదు మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. డీలర్లను అడిగితే పట్టించుకోవట్లేదు.
- సయ్యద్ రఫీ, మొఘల్‌పురా
అదనపు భారం పడింది
ఆధార్ అనుసంధానం సంగతేమో కానీ అదనపు భారం మోపుతోంది. గ్యాస్ సబ్సిడీని పొందేందుకు ఆధార్ కార్డు కోసం కేంద్రాల చుట్టూ రోజుల తరబడి తిరిగాం. ఎల్పీజీని ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకున్నాం. మొదటి నెల అడ్వాన్స్‌గా సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. రెండోసారి సిలిండర్‌కు మాత్రం సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. దీంతో ఆ సొమ్ము జేబు నుంచి చెల్లించాల్సి వచ్చింది.
- శ్రీధర్, శివసాయినగర్, ఉప్పుగూడ