ఆధార్ అనుసంధానం గడువు పొడిగించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో వంట గ్యాస్ వినియోగదారులు బ్యాంకు ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించడానికి మరికొంత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి లేఖ రాయనున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా ఆధార్ అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ పథకం అమలవుతున్న హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పు గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 48 శాతం మాత్రమే అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 52 శాతం మందికి వంట గ్యాస్ సబ్సిడీని కొనసాగిస్తూనే, బ్యాంకు ఖాతాలతో ఆధార్ అనుసంధానానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సీఎం నిర్ణయించారు.