మర్యాద రామన్నలం అనిపించుకుందాం | Travel in the aggressive disputes | Sakshi
Sakshi News home page

మర్యాద రామన్నలం అనిపించుకుందాం

Published Sun, Jan 4 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

మర్యాద రామన్నలం అనిపించుకుందాం

మర్యాద రామన్నలం అనిపించుకుందాం

రోడ్డుపై వాహనాలు నడిపే వారుముఖ్యమైన పత్రాలతో పాటు అదనంగా ఒకదాన్ని తమ వద్ద ఉంచుకోవాలి. దానిపేరే ‘మర్యాద’. అదేంటీ కొత్తగా మాకు మర్యాదలు నేర్పుతారా?

ప్రయాణంలో దూకుడుతో వివాదాలు
తోటి వాహనదారులకు కష్టం
ప్రమాదాలకు దారి తీస్తున్న వైనం
‘అహం’తోనే చిక్కులు
‘పహెలే ఆప్’తో ఘర్షణలు నివారిద్దాం

 
రోడ్డుపై వాహనాలు నడిపే వారుముఖ్యమైన పత్రాలతో పాటు అదనంగా ఒకదాన్ని తమ వద్ద ఉంచుకోవాలి. దానిపేరే ‘మర్యాద’. అదేంటీ కొత్తగా మాకు మర్యాదలు నేర్పుతారా? అని ప్రశ్నిస్తున్నారా? ఇది కాస్త భిన్నమైన మర్యాద. అందుకే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తోంది. కొంతమంది వాహన చోదకులు అడ్డదిడ్డంగా నడపడం.. పరిసరాలను పట్టించుకోకుండా హారన్లు మోగించడం... తోటి వాహనదారులతో అనుచితంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అవతలి వారి స్పందన తీవ్రంగా ఉంటే పరిస్థితి చేయి దాటుతుంది. రోడ్డు రేజ్‌గా పిలిచే ఈ చర్యలు తగదాలు...ఘర్షణలకు దారి తీస్తాయి. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించడంతో పాటు విద్వేషాలకూ బీజం పడుతోంది. వాహనదారులు కొంచెం ‘స్పీడ్’ తగ్గించి... సహనం... ఓర్పుతో పాటు తోటి వారికి మర్యాదనివ్వాలనే విషయాన్ని గుర్తుంచుకుంటే... మనతో పాటు పక్క వారి ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. వెనుక వచ్చే వారికి దారినివ్వడం... ముందు వెళ్లే వారికి ఇబ్బంది కలుగకుండా చూడడం వంటివి మన సంస్కారాన్ని చాటిచెబుతాయి.
 
 
సిటీబ్యూరో:  నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పంజగుట్ట చౌరస్తాలో అకస్మాత్తుగా వాహనాలు స్తంభించాయి. క్షణాల్లో రోడ్డు మధ్యలో పెద్ద గుంపు చేరిపోయింది. కార్లు రోడ్డుపైనే నిలిపివేసిన ఇద్దరు వాహనదారులు ఒకరితో ఒకరు వాగ్యుద్ధానికి దిగారు. మాటా మాటా పెరిగింది. ఆగ్రహావేశాలు మిన్నంటాయి. పరస్పరం దాడులకు తె గబడ్డారు. ఐదు నిమిషాల్లో  పంజగుట్ట నుంచి నాలుగువైపులా కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు పరుగెత్తుకొచ్చారు. విషయం ఆరా తీశారు. ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి పంపించారు. ఒక్క పంజగుట్ట చౌరస్తాలోనే ఇలాంటి రోడ్ రేజ్ సంఘటనలు నిత్యం పదికి పైగా ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 221 కూడళ్లలో వందల సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. వాటిలో పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లి కేసులు నమోదయ్యేవి అరుదు. ఈ ఏడాది అక్టోబర్ 30 నాటికి నగరంలో  970 దాడి కేసులు నమోదు కాగా...వాటిలో 25 శాతం రోడ్‌రేజ్ సంఘటనలే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీటి వెనుక ఈగో, సామాజిక హోదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్లలో వెళ్లేవారు మిగతా వాహనదారులు తమకు దారి ఇవ్వాలని కోరుకుంటారు. వాహనదారులందరిలో ఉండే సహజమైన ఈగో అందుకు నిరాకరిస్తుంది. దాంతో గొడవలు జరుగుతాయి.

 ఇలా చేస్తుంటారు...

► రోడ్లపై జిగ్‌జాగ్ డ్రైవింగ్. ఎక్కువగా  కట్‌లు కొట్టడం.
►  ఓవర్‌టేక్ చేస్తూ తోటి వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తారు.
►అంతులేనివేగంతో తోటి వాహనదారులను అయోమయం, గందరగోళంలోకి నె ట్టివేస్తారు.
► అదే పనిగా హెడ్‌లైట్స్ డిప్ చేయడం.
►  చేతులు గాల్లో ఊపుతూ తోటి వాహనదారులను టీజ్ చేయడం.
►  అకారణంగా తోటి వాహనదారులను కొట్టడం, వాహనం వెనుక బంపర్‌లకు తాకించడం
► బిగ్గరగా అరవడం. తోటి వారితో అనవసరమైన వాదకు దిగి ఇబ్బంది పెట్టడం వంటివన్నీ రోడ్‌రేజ్ సృష్టించేవే...
► బస్‌స్టాపుల్లో ఆగాల్సిన సిటీ బస్సుల ను డ్రైవర్లు రోడ్డు మధ్యలోనే ఆపేస్తారు. ప్రయాణికులు ఎక్కేవరకు, దిగేవరకు బస్సు వెనుక వేల కొద్దీ వాహనాలు స్తంభించిపోతాయి.
►  నగరంలో ఆటోల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. చాలా మంది ఆటోడ్రైవర్లు ఆకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంటారు.  
 గల్లీలోంచి మెయిన్ రోడ్డు పైకి ప్రవేశించే వాహనదారులు ఏమాత్రం మర్యాద లేకుండా దూసుకొస్తారు. అప్పటికే ఒక స్థాయి వేగంతో మెయిన్ రోడ్డుపై వెళ్లే వాహనదారుడికి ఇది తీవ్ర ఇబ్బందికరం. అప్రమత్తంగా ఉండి బ్రేక్ వేస్తే సరి. లేదంటే ప్రమాదాలకు దారి తీస్తుంది.
 
వాహనాల పెరుగుదలతో...

నగరంలో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు, ఇరుకైపోతున్న రహదారులు, మరోవైపు మెట్రో రైలు పనులు, అడుగడుగునా స్తంభించిపోతున్న వాహనాలు వాహనదారుల్లో అసహనానికి  కారణమవుతున్నాయి. నగరంలో కనీసం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయాల్సిన వాహనాలు 17 నుంచి  20 కిలోమీటర్ల వేగాన్ని దాటి ముందుకు వెళ్లడం లేదు. ఏటా  1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. నిత్యం 600  కొత్త వాహనాలు నమోదవుతున్నట్లు అంచనా.ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల సంఖ్య 44 లక్షలకు చేరుకుంది. కానీ రోడ్లు మాత్రం  8 శాతమే ఉన్నాయి. చెన్నై నగరంలో ఒక కిలోమీటర్ పరిధిలో కేవలం 593 వాహనాలు ఉంటే హైదరాబాద్‌లో 723 ఉన్నాయి.పెరుగుతున్న వాహనాలకు తగిన మౌలిక సదుపాయాలు, రహదారులు లేకపోవడంతో వాహనదారుల అసహనం రోడ్‌రేజ్ కు దారి తీస్తోంది.
 
 నిత్య కృత్యం


నగరంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘర్షణలు, గొడవలు, కొట్లాటలు తారసపడుతూనే ఉంటాయి. అడ్డగోలుగా రోడ్డు దాటడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, అదేపనిగా హారన్ మోగించడం, తోటి వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం వంటివి ఘర్షణలకు తావిస్తున్నాయి. వాహనదారుల్లో ఏ ఒక్కరు సహనం పాటించినా అంతటితో పరిష్కారమయ్యే  రోడ్‌రేజ్ .. ఆవేశంతో పెను తుపాన్‌గా మారుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉన్నట్లుగా రోడ్డు రేజ్‌పై ఎలాంటి చట్టాలూ లేవు. ఇది కేవలం వాహనదారుల ప్రవర్తనకు సంబంధించిన అంశం.
 
 అడుగడుగునా ‘రేజ్’...

 గత అక్టోబర్ 6న రక్షాపురం చౌరస్తా మీదుగా  కారులో వెళ్తున్న ఒక న్యాయవాది రెడ్‌సిగ్నల్ పడడంతో వాహనాన్ని ఆపారు. ఆ వెన కాలేఇద్దరు యువకులు బైక్ పై వచ్చారు. గ్రీన్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. న్యాయవాది కారు స్టార్ట్ కాకపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దాని వెనుకే బైక్‌పైన ఉన్న ఆ ఇద్దరు తీవ్ర ఆవేశానికిలోనై న్యాయవాదిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

 నవంబర్ 16వ ఓ సినీ నటుడి కుమారుడు ఔటర్ టోల్‌గేట్ వద్ద టోల్ ఫీజ్ కడుతుండగా... ఆయన వెనుక ఓఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి కారు నిలిపారు. అడ్డంగా ఉన్న కారు తీయాలని ఎమ్మెల్యే అనుచరులు గట్టిగా హారన్ కొట్టారు. యువకుడు వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు. ‘మమ్మల్ని ప్రశ్నిస్తావా’ అంటూ ఇద్దరు ముగ్గురు కారు దిగి యువకుడిపై దాడి చేశారు.
 
పహెలే ఆప్ అందాం...

ఇలాంటి సమస్యల నివారణకు మర్యాద ఒక్కటే పరిష్కారం. వాహనదారులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా రోడ్లను వినియోగించుకొనే హక్కును కలిగి ఉన్నారనే స్పృహతో వాహనాలు నడపాలి. ఈ లక్ష్యంతోనే  కేంద్రప్రభుత్వం గతేడాది దేశవ్యాప్తంగా ‘వెన్ యూ ఆర్ ఆన్ ద రోడ్...సే ‘పహెలే ఆప్’ అనే స్ఫూర్తిదాయకమైన నినాదాన్ని రహదారి భద్రతా ఉద్యమ
 ప్రచారంగా ముందుకు తెచ్చింది. వాహనదారులు పరస్పరంగౌరవించుకొనే విధంగా ‘ముందు మీరు వెళ్లండి’ అని చెప్పడం. మన తోటి వారు ముందు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం దీని ఉద్దేశం. లక్నో నగర ప్రజలు ఒకరినొకరు గౌరవించుకొనేందుకు తరచూ వాడేమాట ‘పహలే ఆప్’.
 
దురుసుతనం వద్దు
 
తోటి వాహనదారుల ప్రవర్తన దురుసుగా ఉండొచ్చు. కానీ మనలో అలాంటి మార్పు రాకుండా చూసుకోవాలి. డ్రైవింగ్ సమయంలో వాగ్వాదం మంచిది కాదు. తోటి వ్యక్తులు తప్పు చేసినా సరే ఆ సమయంలో కొద్ది సేపు మౌనంగా ఉండి, లేదా మీ వాహనాన్ని పక్కకు ఆపుకొని మీలో ఆవేశం, కోపం తగ్గాక తిరిగి ముందుకు వెళ్లండి. ఒత్తిడి, మనస్తాపం, చికాకు వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. తద్వారా ప్రమాదాలకు దారి తీస్తుంది.                                       
 - పుప్పాల శ్రీనివాస్, మోటారు వాహన తనిఖీ అధికారి, రహదారి భద్రతా నిపుణులు
 
సహనం కోల్పోవద్దు
 
 రోడ్లపై ప్రమాదాలు జరిగే సమయంలో వాహనదారులు సహనం కోల్పోతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ స్తంభించిపోయి తోటి వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎవరూ ఉద్దేశపూర్వకంగా ప్రమాదాలు చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.  క్షణికావేశానికి లోనుకాకుండా సంయమనం పాటించాలి.  
 - సాలం, వాహనదారుడు. పహాడీషరీఫ్
 
ఓపిక అవసరం
 
చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రులకు తరలించి... ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులకు అప్పగించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ స్తంభించకుండా చూడాలి. ప్రతి చిన్న ప్రమాదాన్నీ పెద్దదిగా చేసి తోటి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్దతి కాదు.            
 - ఫయీం, వాహనదారుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement