రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
♦ రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు
♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద కార్యక్రమం
♦ సీఎం కేసీఆర్, మంత్రులు, వివిధ పార్టీల నేతల నివాళులు
♦ అంబేడ్కర్ టవర్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వపరంగా వివిధ కార్యక్రమాలు, శంకుస్థాపనలు నిర్వహించగా... కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, నాయిని, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఉన్నారు.
ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి, ఆరెపల్లి మోహన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, జి.కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, టీటీడీపీ నాయకులు ఎల్.రమణ, మోత్కుపల్లి, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, సీపీఐ నేతలు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం తదితరులు కూడా అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని పాత అంబేడ్కర్ భవన్ స్థానంలో అంబేడ్కర్ టవర్స్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.