‘స్వచ్ఛ హైదరాబాద్’ టు గ్రేటర్ పీఠం!
గ్రేటర్ పీఠం..‘గులాబీ’ పార్టీ లక్ష్యం. స్వచ్ఛ’ తోడ్పాటునిస్తుందని నమ్మకం. పక్కా వ్యూహంతో కార్యక్రమం. పార్టీ నేతల కంటే ప్రజలనే ఆకర్షించాలని నిర్ణయం. ‘స్థానిక’ బలం పెరగాలంటే సామాన్యుడికి లాభం చేకూర్చాలని..మొత్తంగా ‘స్వచ్ఛ హైదరాబాద్’ ఊతంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గట్టెక్కాలని ప్లాన్!
సిటీబ్యూరో: సీఎం నుంచి సీఎస్ దాకా పలువురు వీవీఐపీలతో సహా వేలమంది భాగస్వాములు కానున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్ర మాన్ని టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటోందా? అంటే..అవుననే వినిపిస్తోంది. స్వచ్ఛ హైదరాబాద్.. ఎవరూ కాదనలేని కార్యక్రమం. స్వచ్ఛ భారత్‌లో భాగంగానే స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే..ఈ ఊపుతో ప్రజల్లోకి వెళ్లి.. దాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల దాకా కొనసాగించాలనేది అధికార పార్టీ టీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. స్వచ్ఛ హైదరాబాద్ అంటే.. పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించింది. కానీ దీంతోపాటే తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఫుట్‌పాత్‌లు..రహదారుల మరమ్మతులు, ఇతరత్రా అన్ని సమస్యలూ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. ఆయా యూనిట్ల(విభాగాల) అధికారులు పెన్షన్లు అందని వారి నుంచి మొదలుపెడితే ప్రజలకున్న ఏ సమస్య అయినా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలున్నవారినీ గుర్తించి ఆదుకోవాలన్నారు. అంటే ప్రజల్లో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడేందుకు కృషి జరుగుతుంది. సమస్యల పరిష్కారానికి ఒక్కో యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు స్థానికంగానే ఖర్చు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంకా ఎక్కువైనా ఇస్తామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంతోపాటు .. ప్రభుత్వంపై ప్రజలు సానుకూలత చూపేందుకు ఇది ఉపకరిస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే వందరోజుల టార్గెట్‌లో భాగంగా ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే పనిని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్‌తో వచ్చే ఊపును ఎన్నికల దాకా కొనసాగించనున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎందుకిలా.. ?
ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్ క్యాడర్ పెరిగినప్పటికీ, గ్రేటర్‌లో స్థానికంగా క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. ఇటీవలే దీనిపై దృష్టి సారించారు. ఎటొచ్చీ డిసెంబర్‌లోగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగించాల్సి ఉంది. ఎలాగైనా జీహెచ్‌ఎంసీపై జెండా ఎగరేయాలనేది లక్ష్యం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తిగా స్థానిక సమస్యలపై ఆధారపడ్డవి కావడంతో ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే వ్యూహాత్మకంగా వందరోజుల టార్గెట్‌ను అమలుచేయాలని తొలుత భావించారు. స్వచ్ఛ భారత్‌ను కూడా ఎన్నికలకు అనుకూలంగా మలచుకునేందుకు దీంతోపాటే ఇతర అంశాలనూ జోడించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీగా స్థానిక నేతల బలంతోనే భారీ మెజార్జీ సాధించడం ఇప్పుడంత ఈజీగా కనిపించడం లేదు. పార్టీ పెద్దలకూ ఆ విషయం తెలుసు. దీంతో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంగా ప్రజల మద్దతు పొందాలనే యోచనలో పార్టీ, ప్రభుత్వ పెద్దలున్నట్లు తెలుస్తోంది.