గులాబీ కళ
నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. సుమారు 36 వేల మంది కూర్చునేందుకు వీలుగా వేదిక వద్ద ఏర్పాట్లు చేశారు. నగరమంతా భారీ కటౌట్లు, స్వాగత తోరణాలతో అలంకరించారు.
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో టీఆర్‌ఎస్ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. సమావేశం జరిగే ఎల్‌బీస్టేడియంలో భారీ వేదిక, సుమారు 36 వేలమంది కూర్చుకునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేశారు. సమావేశాలను నిరంతరాయంగా వీక్షించేందుకు స్టేడియం లోపల ఆరు భారీ ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. ఎండవేడిమి తగలకుండా 300 భారీ కూలర్లతో ఎయిర్‌కూలింగ్ ఏర్పాట్లు చేశారు. మంచినీరు, అత్యవసర వైద్య సహాయం అందించేందుకు మందులు, అంబులెన్సులు, వైద్యబృందాలను అందుబాటులో ఉంచుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సమావేశాలకు హాజరయ్యేవారికి నిజాం కళాశాల మైందానంలో పసందైన తెలంగాణ వంటకాలు వడ్డించేందుకు ఘనంగా భోజనం ఏర్పాట్లు చేశారు. గురువారం నగర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి,తలసాని, పద్మారావు, మహమూద్‌అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు తదితరులు ప్లీనరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విశ్వనగరంపై తీర్మానానికి అవకాశం...
ప్లీనరీలో ప్రవేశపెట్టనున్న తీర్మానాల్లో గ్రేటర్ నగరానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీటి వసతుల కల్పన, బహుళ వరుసల రహదారులు, మల్టిగ్రిడ్ సపరేటర్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, పేదలకు రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్లు, హరితహారం, సేఫ్‌కాలనీలు వంటి పథకాలతో మహానగరాన్ని దశలవారీగా ప్రభుత్వం ఎలా తీర్చిదిద్దనుందో ఈ ప్లీనరీ వేదికపైనుంచి అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు.
అడుగడుగునా గులాబీ తోరణాలు..
తెలంగాణాలోని పది జిల్లాలతోపాటు గ్రేటర్ నలుమూలల నుంచి ప్లీనరీకి హాజరయ్యే వారికి ఘనస్వాగతం పలికేందుకు అడుగడుగునా స్వాగత తోరణాలు, 150 స్వాగత ద్వారాలు, వివిధ కూడళ్లలో 400 భారీ హోర్డింగ్స్‌ను ఏర్పాటుచేశారు. గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా ప్లీనరీకి హాజరుకానున్నారు. త్వరలో బల్దియా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కార్పొరేటర్లుగా పోటీచేయాలనుకుంటున్న ఔత్సాహికులు అధినేత, ముఖ్య నేతల దృష్టిలో పడేందుకు అడుగడుగునా మినీ కటౌట్లు ఏర్పాటు చేయడం విశేషం. ఇక బందోబస్తు ఏర్పాట్లను కమిషనర్ మహేందర్‌రెడ్డి గురువారం పర్యవేక్షించారు. ఎల్‌బీస్టేడియంలో తనిఖీలు చేపట్టారు. 2500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు.
ఘనంగా నిర్వహిస్తున్నాం: మంత్రి పద్మారావు
బన్సీలాల్‌పేట్: తెలంగాణ అవతరించిన అనంతరం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ తొలి ప్లీనరీ సమావేశానికి భారీగా ఏర్పాట్లు చేసినట్లు ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న జరిగే ప్లీనరీ, 27న జరిగే బహిరంగ సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎల్బీస్టేడియం వేదికగా టీఆర్‌ఎస్ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్లీనరీలో పలు తీర్మానాలు ప్రవేశ పెడుతున్నట్లు వివరించారు. పార్టీ అధినేత కేసీఆర్ ప్లీనరీలో రోజంతా అక్కడే ఉంటారని చెప్పారు.