ఉద్యమకారులు హుష్‌కాకి!
‘గ్రేటర్’లో వలసదారులకే టీఆర్‌ఎస్ టికెట్లు
* ఉద్యమంలో పనిచేసినవారికి అరకొరే
* అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి
* పలు డివిజన్లలో రెబెల్స్‌గా బరిలోకి
* తలపట్టుకుంటున్న అధికార పార్టీ
* పాతబస్తీ, జూబ్లీహిల్స్ మినహా మిగతాచోట్ల టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ బెడద
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వస్తున్న తరుణంలో అధికార టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ గుబులు పట్టుకుంది. కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్‌లకు ఈ బెడద అంతగా లేనప్పటికీ టీఆర్‌ఎస్‌కు మాత్రం కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తమను విస్మరించి, కొత్తగా వచ్చిన డబ్బున్న వారికే టికెట్లిచ్చారంటూ ఉద్యమ నేతలు కినుక వహిస్తున్నారు. 2001 నుంచీ పార్టీని నమ్ముకుని ఉద్యమంలో పనిచేసి లాఠీ దెబ్బలు తిని, జైళ్లపాలైన వైనాన్ని విస్మరించారంటూ ఆగ్రహిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో సింహభాగం టికెట్లను ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికే కేటాయించారంటూఉద్యమ నేతలు భగ్గుమంటున్నారు.
‘‘మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె తదితర ఆందోళనల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పనిచేసిన వారిని పక్కనపెట్టారు. ధన బలం, అంగ బలమున్న గెలుపు గుర్రాలకే పెద్దపీట వేశారు’’ అంటూ ఆక్రోశిస్తున్నారు. మరోవైపు కార్పొరేటర్ టికెట్ ఆశించి ఇటీవలి కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల నుంచి వెల్లువలా టీఆర్‌ఎస్‌లో చేరిన ఆశావహులు కూడా తీరా టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. వెరసి టీఆర్‌ఎస్‌లో అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్నాయి. అసమ్మతుల్లో చాలామంది రెబెల్స్‌గానైనా సరే బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పాతబస్తీ, జూబ్లీహిల్స్ మినహా మిగతా చోట్ల టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ బెడద అధికంగా ఉంది. పలువురు నేతలు టీఆర్‌ఎస్ తమను అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ నామినేషన్లు దాఖలు చేసేశారు. పలు డివిజన్లలో ఇలా ఇద్దరు మొదలుకుని ఏకంగా ఎనిమిది మంది దాకా నామినేషన్లు వేయడం గమనార్హం. ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 11 డివిజన్లుండగా వాటిలో చాలాచోట్ల టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ బెడద తప్పడం లేదు.
హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, మన్సూరాబాద్, నాగోల్, లింగోజిగూడ, చంపాపేట్, కొత్తపేట్, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్లలో పలువురు టీఆర్‌ఎస్ నేతలు పార్టీ టికెట్ ఇంకా దక్కకపోయినా నామినేషన్లు వేసేశారు. లింగోజిగూడలో అత్యధికంగా 17 మంది టీఆర్‌ఎస్ ఆశావహులు నామినేషన్లు వేయడం గమనార్హం! ఇలా సూరారం, కొత్తపేటల్లో ఎనిమిదేసి మంది, హస్తినాపురం, సరూర్‌నగర్, నాగోల్‌లలో ఏడుగురి చొప్పున, చంపాపేట్‌లో ఆరుగురు, చింతల్, బీఎన్‌రెడ్డిలో ఐదుగురి చొప్పున నామినేషన్లు వేశారు. వీరిలో టీఆర్‌ఎస్ బీ ఫారం దక్కనివారంతా తిరుగుబాటుఅభ్యర్థులుగానైనా బరిలో నిలిచేందుకే పట్టుదల చూపుతున్నట్టు సమాచారం. దాంతో పార్టీ నాయకత్వం తలలు పట్టుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన పార్టీకి ఈ పరిణామం తలనొప్పిగా మారింది.
బీజేపీలోనూ...
బీజేపీకి కూడా అసంతృప్తుల బెడద తప్పడంలేదు. పార్టీ బలంగా ఉన్న డివిజన్లను టీడీపీకి వదిలేయడంపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి కాస్తోకూస్తో బలమున్న డివిజన్లను టీడీపీకి కేటాయించడంతో పలువురు కాషాయ తమ్ముళ్లు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులవుతున్నారు.