టీఆర్ఎస్‌కు శివసేన లక్షణాలు
ఓవైపు ప్రజలు చనిపోతుంటే యాగాలా: ప్రొ. కంచె ఐలయ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు పూర్తిగా శివసేన పార్టీ లక్షణాలున్నాయని ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ తెలంగాణ శివసేన అని గతంలోనే తాను రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవైపు ప్రజలు చనిపోతుంటే సీఎం కేసీఆర్ ఆయత మహా చండీయాగాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. 16వ శతాబ్దంలో రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించగా.. 21వ శతాబ్దంలో సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూడలిజం బురదలో పడిందని, దాన్నుంచి బయటకు తీసుకురావాలన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఐలయ్య రచించిన ‘ఫ్యూడలిజం మల్లొచ్చింది’ వ్యాస సంపుటిని దళిత విద్యార్థిని కుమారి కన్నం ప్రజ్వలతో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ‘‘సర్దార్ వల్లభాయ్‌పటేల్ తొలి ప్రధాని అయితే దేశం ఇలా ఉండేది కాదని బీజేపీ నాయకులు అంటున్నారు. కానీ పటేల్ ఆ పదవిలో ఉండి ఉంటే అంబేడ్కర్‌ను రాజ్యాంగాన్ని రాయనిచ్చే వారు కాదు. బీజేపీ సంపుడు పార్టీ’’ అని అన్నారు. రకరకాల ముసుగులు వేసుకుని పాలకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని దుర్మార్గంగా అణిచివే స్తున్నాయని తమ్మినేని పేర్కొన్నారు.