ఏకపక్షంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్
బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఏకపక్షంగా అసెంబ్లీలో వ్యవహరించిందని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. శాసనమండలి సభ్యులు ఎన్.రామచందర్‌రావుతో కలసి హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలు, ప్రజలపై ప్రభావం, ప్రతిపక్షాల సూచనల వంటి వాటిపై చర్చలకు అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం ఏకపక్షంగా, నియంతృత్వంతో వ్యవహరించిందని విమర్శించారు.
గొంతుపైన కత్తి పెట్టినట్టుగా బడ్జెట్‌ను, బిల్లులను అధికారపక్షం పాస్ చేయించుకుందని లక్ష్మణ్ ఆరోపించారు. అయినా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలనే తాము సహకరించామని చెప్పారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తే.. మంత్రులు ఎదురుదాడి చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, గొప్పలకు పోయి భారీస్థాయిలో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కలర్‌ఫుల్‌గా ఉందని లక్ష్మణ్ అన్నారు.