'బల్దియాపై ఎగిరేది మా జెండానే'
హైదరాబాద్: బల్దియాపై టీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని చెప్పారు. అయితే, పాతబస్తీలో ఘర్షణ చోటుచేసుకోవడం దురదృష్టకరమని, చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసన తర్వాత మంత్రి కేటీఆర్, షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రచార సరళి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోసారి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన మీడియాకు, పోలీసు యంత్రాంగానికి, జీహెచ్ఎంసీకి, పార్టీనాయకులకు, నేతలకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ప్రజల విశ్వాసం పొందారని చెప్పారు. మంత్రులందరిపై ప్రచార బాధ్యతలు పెట్టినా కేటీఆర్ కు ప్రధాన ప్రచార బాధ్యతలు అప్పగించి కేసీఆర్ మంచి పనిచేశారని, అలా చేయడం ద్వారా రాష్ట్రానికి, రాజధానికి మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగించారని చెప్పారు. కేటీఆర్ పనితీరు చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని అన్నారు. టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.